Rekha Gupta: ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ భద్రత

Delhi CM Rekha Gupta Given Z Security After Attack
  • ఈ రోజు ఉదయం సీఎం నివాసానికి చేరుకున్న సీఆర్పీఎఫ్ బలగాలు
  • 24 గంటలూ రక్షణ కల్పించేందుకు అదనపు బలగాల మోహరింపు
  • సీఎంపై దాడి ఘటనను సీరియస్ గా పరిగణించిన కేంద్రం
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడి ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఘటనపై స్పందిస్తూ.. రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ రోజు ఉదయం సీఆర్పీఎఫ్ బలగాలు సీఎం నివాసానికి చేరుకున్నాయి. సీఎం భద్రత బాధ్యతలను ఢిల్లీ పోలీసుల నుంచి స్వీకరించాయి. సీఎం వ్యక్తిగత భద్రతతో పాటు సీఎం నివాసానికి, క్యాంపు కార్యాలయానికి 24 గంటలూ భద్రత కల్పించేందుకు అధికారులు అదనపు బలగాలను మోహరించారు.

జెడ్ కేటగిరీ భద్రతలో 20 మందికి పైగా సిబ్బంది, స్పెషల్ గార్డులు, డ్రైవర్లు, ఎస్కార్ట్ వాహనాలను ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు సమకూర్చారు. కాగా, బుధవారం ఉదయం ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ‘జన్ సున్ వాయి’ కార్యక్రమం నిర్వహిస్తుండగా ఆమెపై దాడి జరిగిన విషయం తెలిసిందే. తన సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినట్లు నటించిన ఓ వ్యక్తి ఆమె చెంపపై కొట్టాడు. వెంటనే స్పందించిన సీఎం సెక్యూరిటీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. సీఎంను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
Rekha Gupta
Delhi CM
Z Category Security
Delhi Chief Minister
Jan Sunwayi
CRPF
Delhi Police
Security Breach
Attack

More Telugu News