Narasimha Naidu: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో దారుణం .. విద్యార్ధి ఆత్మహత్య

Narasimha Naidu Student Suicide at Idupulapaya IIIT
  • బాత్ రూమ్ కిటికీకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న పీయూసీ 2 విద్యార్ధి నరసింహనాయుడు
  • మృతదేహాన్ని వెంపల్లి ఆసుపత్రికి తరలించిన పోలీసులు
  • కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన డైరెక్టర్ కుమారస్వామి
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ క్యాంపస్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బాత్‌రూమ్‌లోని కిటికీకి ఉరివేసుకొని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో క్యాంపస్‌లో తీవ్ర విషాదం నెలకొంది.

వివరాల్లోకి వెళితే, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని ఒంగోలు ట్రిపుల్ ఐటీలో పీయూసీ 2 చదువుతున్న విద్యార్థి నరసింహనాయుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేటకు చెందిన ఈ విద్యార్థి సెల్‌ఫోన్‌కు బానిస కావడం, తండ్రి ఇదివరకే మరణించి ఉండటం వంటి కారణాల వల్ల బాత్‌రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థి మృతదేహాన్ని వేంపల్లి 50 పడకల ఆసుపత్రికి తరలించారు. డైరెక్టర్ కుమారస్వామి గుప్తా విద్యార్థి తల్లికి సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ఈ క్యాంపస్‌లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఇది మొదటిసారి కాదు. గత ఏడాది, అంతకు ముందు కూడా వివిధ కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా విద్యార్థి ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు, ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదివరకు కూడా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ పలుమార్లు వార్తల్లో నిలిచింది. గత ఏడాది భద్రతా సిబ్బంది తనిఖీల్లో ఇద్దరు విద్యార్థుల వద్ద గంజాయి, సిగరెట్ ప్యాకెట్లు దొరకడం తీవ్ర సంచలనం కలిగించింది. 
Narasimha Naidu
Idupulapaya IIIT
RGUKT Idupulapaya
IIIT suicide
Andhra Pradesh
Ongole IIIT
Student suicide
Srikakulam district
Education
Youth

More Telugu News