Ravi: పెళ్లి ప్రపోజల్ తిరస్కరించిన యువతి... కారును చెరువులోకి పోనిచ్చి హత్య

Karnataka Man Kills Woman by Driving Car into Lake After Rejection
  • కర్ణాటకలోని హసన్ జిల్లాలో జరిగిన దారుణ ఘటన
  •  నిందితుడు రవికి అప్పటికే వివాహమైనట్టు గుర్తింపు
  • ఈదుకుంటూ బయటపడ్డ నిందితుడు, ఊపిరాడక మహిళ మృతి
  • ప్రమాదంగా చిత్రీకరించే యత్నం
పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందన్న కోపంతో ఓ వివాహితుడు దారుణానికి ఒడిగట్టాడు. స్నేహితురాలితో కలిసి వెళుతున్న కారును చెరువులోకి పోనిచ్చి ఆమె మృతికి కారణమయ్యాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో నిన్న చోటుచేసుకుంది.

చందనహళ్లి ప్రాంతానికి చెందిన శ్వేత (32), రవి చాలా ఏళ్ల క్రితం ఒకేచోట పనిచేసేటప్పుడు పరిచయమయ్యారు. భర్త నుంచి విడిపోయిన శ్వేత తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. మరోవైపు, రవికి అప్పటికే వివాహమైంది. గత కొంతకాలంగా రవి తనను ప్రేమించాలంటూ శ్వేతపై ఒత్తిడి తెస్తున్నాడు. తన భార్యను వదిలేసి ఆమెతోనే ఉంటానని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, అతడి ప్రతిపాదనను శ్వేత తిరస్కరించింది.

ఈ క్రమంలోనే బుధవారం శ్వేతను తన కారులో ఎక్కించుకున్నాడు. ఆమెతో మాట్లాడుతూనే వాహనాన్ని వేగంగా చందనహళ్లి చెరువులోకి పోనిచ్చాడు. ఈ ఘటనలో శ్వేత కారులోనే చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, రవి ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, సహాయక బృందాలు రాత్రివేళ సహాయక చర్యలు చేపట్టి శ్వేత మృతదేహాన్ని వెలికితీశాయి.

కారు ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయిందని, తాను బయటపడ్డా శ్వేతను కాపాడలేకపోయానని విచారణలో రవి పోలీసులకు చెప్పాడు. అయితే, శ్వేత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దీనిని హత్యగా నిర్ధారించారు. పథకం ప్రకారమే రవి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ప్రాథమికంగా నిర్ధారించారు. రవిపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Ravi
Karnataka crime
Hassan district
love rejection murder
woman killed
car accident murder
Chandanahalli lake
infidelity crime
arranged murder

More Telugu News