పార్టీ ఫిరాయింపుల వ్యవహారం .. పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు !

  • కీలక నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ 
  • సుప్రీంకోర్టు అదేశాలతో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు త్వరలో నోటీసులు 
  • ఏజీ, న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపిన స్పీకర్
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణలోని పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. న్యాయ సలహా తీసుకున్న అనంతరం ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారిపై భారత రాజ్యాంగంలోని ఫిరాయింపు నిరోధక చట్టం (10వ షెడ్యూల్) ప్రకారం అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 25న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో అడ్వొకేట్ జనరల్‌తో పాటు సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఆ తరువాతనే ఆయా ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌కుమార్, తెల్లం వెంకట్రావు, అరెకపూడి గాంధీ, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వీరందరికీ నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అయితే ఇందులో ఒకరిద్దరు తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ప్రకటించారు. ప్రస్తుతం స్పీకర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ అంశం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 


More Telugu News