మీరు ఏపీ డీఎస్సీ అభ్యర్థులా... అయితే ఇది గమనించారా?

  • టెట్ మార్కుల్లో సవరణకు చివరి అవకాశం ఇచ్చిన విద్యాశాఖ 
  • అభ్యర్థులు తమ టెట్ మార్కులను వెబ్‌సైట్‌లో 21వ తేదీ మధ్యాహ్నం వరకు సరిచేసుకోవచ్చన్న కన్వీనర్ కృష్ణారెడ్డి
  • ఫైనల్ ఎంపిక జాబితా ఇంకా విడుదల కాలేదన్న విద్యాశాఖ
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ 2025కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. డీఎస్సీ స్కోర్ కార్డులలో టెట్ మార్కుల విషయంలో అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులకు మరొకసారి సవరణ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అభ్యర్థులు తమ టెట్ మార్కులను వెబ్‌సైట్‌లో సరిచేసుకునేందుకు 21వ తేదీ (గురువారం) మధ్యాహ్నం 12:00 గంటల వరకు చివరి అవకాశం ఉంటుందని కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి తెలిపారు.

ఇప్పటికే విడుదలైన డీఎస్సీ స్కోర్ కార్డులపై అభ్యంతరాలు స్వీకరించగా, వాటిని పరిశీలించి సవరించిన టెట్ మార్కులతో స్కోర్ కార్డులను https://apdsc.apcfss.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు ఆయన వెల్లడించారు. అభ్యర్థులు తమ వివరాలను పరిశీలించి, ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని సూచించారు.

అయితే, సోషల్ మీడియాలో డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అభ్యర్థులను పిలిపిస్తున్నట్టుగా ఒక తప్పుడు ప్రచారం జరిగింది. దీనిని కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రస్తావించడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. దీనిపై అధికారులు స్పందించి స్పష్టతనిచ్చారు. ఫైనల్ ఎంపిక జాబితా ఇంకా విడుదల కాలేదని, ఎలాంటి వెరిఫికేషన్‌కు ప్రభుత్వం పిలవలేదని వారు తేల్చి చెప్పారు.

అధికారికంగా టెట్ మార్కుల్లో మార్పులు జరిగితే, ఫైనల్ ఎంపిక జాబితాలో మార్పులు వచ్చే అవకాశం కూడా ఉందని స్పష్టం చేశారు. కాబట్టి, అభ్యర్థులు ఈ అవకాశాన్ని చివరిదిగా భావించి, ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని విజ్ఞప్తి చేశారు. 


More Telugu News