Life insurance GST: సామాన్యులకు గుడ్ న్యూస్.. ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ రద్దుకు కేంద్రం కీలక ప్రతిపాదన

Centre Proposes Zero GST On Health Life Insurance For Individuals
  • ప్రస్తుతం ఈ పాలసీలపై 18 శాతం పన్ను విధింపు
  • పన్ను రేట్ల తగ్గింపుపై మంత్రుల బృందంలో ఏకాభిప్రాయం
  • త్వరలో జీఎస్టీ కౌన్సిల్‌కు నివేదిక సమర్పించనున్న మంత్రుల బృందం
  • తుది నిర్ణయం జీఎస్టీ కౌన్సిల్ పరిధిలోనే ఉంటుందని వెల్లడి
  • 2023-24లో ఆరోగ్య బీమా జీఎస్టీ ద్వారా రూ.8,262 కోట్ల ఆదాయం
దేశంలోని సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరటనిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఆరోగ్య, జీవిత బీమా పాలసీల ప్రీమియంలపై ప్రస్తుతం విధిస్తున్న 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను పూర్తిగా మినహాయించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై ఏర్పాటైన మంత్రుల బృందం (జీఓఎం) చర్చించిందని, త్వరలోనే దీనిపై జీఎస్టీ కౌన్సిల్‌కు నివేదిక సమర్పించనున్నట్లు బీహార్ ఉప ముఖ్యమంత్రి, జీఓఎం కన్వీనర్ సామ్రాట్ చౌదరి వెల్లడించారు.

బుధవారం జరిగిన మంత్రుల బృందం సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత, కుటుంబ అవసరాల కోసం తీసుకునే ఆరోగ్య, జీవిత బీమా పాలసీలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ స్పష్టమైన ప్రతిపాదన అని ఆయన తెలిపారు. ఈ అంశంపై సమావేశంలో చర్చించామని, జీఎస్టీ కౌన్సిల్‌కు సమర్పించబోయే నివేదికలో ఈ విషయాన్ని పొందుపరుస్తామని చెప్పారు.

పన్ను రేట్లను తగ్గించాలన్న విషయంలో మంత్రుల బృందంలోని సభ్యులందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారని సామ్రాట్ చౌదరి పేర్కొన్నారు. అయితే, కొన్ని రాష్ట్రాలు తమ అభిప్రాయాలను ప్రత్యేకంగా తెలియజేశాయని, వాటన్నింటినీ నివేదికలో చేర్చుతామని అన్నారు. పన్ను రేట్లపై తుది నిర్ణయం మాత్రం జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

దేశంలో జీఎస్టీ సంస్కరణలలో భాగంగా ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. భవిష్యత్తులో వస్తువులను ‘మెరిట్’, ‘స్టాండర్డ్’ అనే రెండు కేటగిరీలుగా విభజించి, కేవలం 5, 18 శాతం చొప్పున రెండు పన్ను స్లాబులనే అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఇన్సూరెన్స్ పాలసీలకు ఊరట కల్పించాలని భావిస్తోంది. కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ రూపంలోనే ప్రభుత్వానికి రూ.8,262 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదనపై జీఎస్టీ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Life insurance GST
Samrat Choudhary
Health insurance GST
GST council
GST rates India
Insurance premium tax
Goods and Services Tax
Tax reforms India
Indian economy
Bihar Deputy CM

More Telugu News