: రైళ్లలో లగేజీపై కొత్త నిబంధనలు.. విమానాల తరహాలో కొత్త రూల్స్!

  • రైల్వే స్టేషన్లలో ఎలక్ట్రానిక్ యంత్రాలతో లగేజీ బరువు తనిఖీ
  • పరిమితికి మించి లగేజీ ఉంటే అదనపు రుసుములు లేదా జరిమానా
  • క్లాసుల వారీగా 35 కిలోల నుంచి 70 కిలోల వరకు లగేజీకి అనుమతి
భారత రైల్వే ప్రయాణికులకు త్వరలో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇప్పటివరకు లగేజీ బరువుపై పెద్దగా ఆంక్షలు లేని రైలు ప్రయాణంలో, ఇకపై విమానాశ్రయాల తరహాలో కఠినమైన తనిఖీలు చేపట్టేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లే వారి నుంచి అదనపు రుసుములు లేదా జరిమానాలు వసూలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు జాతీయ మీడియా వెల్లడిస్తోంది.

ఈ కొత్త విధానం ప్రకారం, దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాలను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లే ముందే తమ లగేజీ బరువును తప్పనిసరిగా తనిఖీ చేయించుకోవాలి. నిర్ణీత పరిమితికి మించి బరువు ఉన్నా లేదా పరిమాణం మరీ పెద్దగా ఉన్నా ప్రయాణికులు అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే వారిని రైలు ఎక్కేందుకు అనుమతిస్తారు.

రైల్వే శాఖ ప్రతిపాదిత నిబంధనల ప్రకారం, ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు 70 కిలోల వరకు, ఏసీ 2-టైర్ ప్రయాణికులు 50 కిలోల వరకు ఉచితంగా లగేజీ తీసుకెళ్లవచ్చు. అదేవిధంగా, ఏసీ 3-టైర్, స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు 40 కిలోలు, జనరల్ బోగీలలో ప్రయాణించే వారికి 35 కిలోల పరిమితిని విధించనున్నారు. ఈ నిబంధనలను ప్రయోగాత్మకంగా తొలుత ఉత్తర మధ్య రైల్వే జోన్‌ పరిధిలోని స్టేషన్లలో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆదాయాన్ని పెంచుకోవడం లక్ష్యంగా రైల్వే శాఖ మరో కీలక అడుగు వేస్తోంది. ఆధునీకరించిన స్టేషన్లలో దుస్తులు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర ప్రయాణ ఉపకరణాలు విక్రయించే ప్రముఖ సింగిల్-బ్రాండ్ స్టోర్లను ప్రారంభించాలని యోచిస్తోంది. 

More Telugu News