ఆన్‌లైన్ మనీ గేమింగ్‌పై కేంద్రం ఉక్కుపాదం.. నేడే పార్లమెంటులో కీలక బిల్లు

  • ఆన్‌లైన్ మనీ గేమింగ్‌పై పూర్తి నిషేధానికి కేంద్రం సిద్ధం
  • పార్లమెంటులో నేడే ప్రవేశపెట్టనున్న ‘ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు, 2025’
  • ఆన్‌లైన్ రమ్మీ వంటి యాప్‌లపై వేటు పడే అవకాశం
  • యువత, చిన్నారులను వ్యసనం నుంచి కాపాడేందుకే ఈ చర్య
  • నైపుణ్యం, అదృష్టం ఆధారిత గేమ్స్ మధ్య తేడా ఇక రద్దు
దేశంలో ఆన్‌లైన్ మనీ గేమింగ్‌కు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. డబ్బు పెట్టి ఆడే అన్ని రకాల ఆన్‌లైన్ గేమ్‌లను నిషేధించే లక్ష్యంతో రూపొందించిన "ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్, నియంత్రణ బిల్లు, 2025"ను పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే  ఆన్‌లైన్ రమ్మీ వంటి ఎన్నో పాపులర్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు నిషేధానికి గురయ్యే అవకాశం ఉంది.

ఈ బిల్లు ప్రకారం, డబ్బు లేదా ఇతర విలువైన వస్తువులు చెల్లించి, ప్రతిఫలంగా డబ్బు గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఆడే ఏ గేమ్‌ అయినా "ఆన్‌లైన్ మనీ గేమ్" కిందకే వస్తుంది. అయితే, ఈ-స్పోర్ట్స్‌కు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. ముఖ్యంగా యువత, చిన్నారులు ఈ గేమ్‌లకు బానిసలై తీవ్రమైన మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) బిల్లు ముసాయిదాలో ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రస్తుతం దేశంలో ఆన్‌లైన్ గేమింగ్‌పై ఒకేరకమైన చట్టం లేదు. తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఇప్పటికే నిషేధం విధించగా, మరికొన్ని రాష్ట్రాల్లో పాక్షిక నిబంధనలు ఉన్నాయి. ఈ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని కంపెనీలు విదేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగానే కేంద్రం ఈ కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది.

ఈ బిల్లులో నిబంధనలు ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు ప్రతిపాదించారు. ఆన్‌లైన్ మనీ గేమింగ్ సేవలు అందించే కంపెనీలకు,  బాధ్యులైన వ్యక్తులకు గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. కోటి వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి. ఇలాంటి గేమ్‌లకు ప్రచారం కల్పించినా రెండేళ్ల జైలు, రూ. 50 లక్షల వరకు జరిమానా విధించనున్నారు.

ఈ చట్టం ప్రకారం, ఇప్పటివరకు న్యాయస్థానాలు గుర్తిస్తూ వచ్చిన ‘నైపుణ్య ఆధారిత గేమ్’ (గేమ్ ఆఫ్ స్కిల్), ‘అదృష్టంపై ఆధారపడిన గేమ్’ (గేమ్ ఆఫ్ ఛాన్స్) మధ్య వ్యత్యాసం పూర్తిగా తొలగిపోనుంది. డబ్బు ప్రమేయం ఉన్న ఏ గేమ్‌ అయినా ఇకపై నిషేధమే. అది నైపుణ్యంతో ఆడేదా లేక అదృష్టంతో ఆడేదా అనే చర్చకే తావుండదు.

అంతేకాకుండా, మనీ గేమింగ్‌కు సంబంధించిన లావాదేవీలను ప్రాసెస్ చేయకుండా ఆర్థిక సంస్థలను, బ్యాంకులను కూడా ఈ బిల్లు నిషేధిస్తుంది. చట్టం అమల్లోకి వచ్చాక, నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత కంపెనీలతో పాటు ఆ కార్యకలాపాలకు బాధ్యులైన వ్యక్తులను కూడా జవాబుదారీ చేయనున్నారు.


More Telugu News