KTR: జోకర్‌ను ఎన్నుకుంటే సర్కస్ చూడాల్సిందే: రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్

KTR Fires on Revanth Government Over Internet Cable Removal
  • వేలాడుతున్న విద్యుత్ తీగలపై అధికారుల చర్యలు 
  • ఇంటర్నెట్ కేబుళ్లను సైతం తొలగించడంపై విమర్శలు
  • ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "జోకర్‌ను ఎన్నుకుంటే, అతని పాలనలో ఇలాంటి సర్కస్‌ ఫీట్లే చూడాల్సి వస్తుంది" అంటూ ఎద్దేవా చేశారు. వేలాడుతున్న విద్యుత్తు తీగలను సరిచేసే క్రమంలో అధికారులు ఇంటర్నెట్‌ సహా అన్ని కేబుల్‌ వైర్లనూ తొలగించడంపై ఆయన మండిపడ్డారు.

టీజీఎస్‌పీడీసీఎల్ అధికారులు తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వల్ల లక్షలాది మంది ఇంటర్నెట్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు (ఐఎస్‌పీ) గానీ, వినియోగదారులకు గానీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే హఠాత్తుగా కేబుళ్లను కత్తిరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

ఈ చర్య కారణంగా వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటున్న ఉద్యోగులు, ఆన్‌లైన్‌ సేవలు వినియోగించుకునే వారి రోజువారీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయని కేటీఆర్ తెలిపారు. బాధితుల ఆవేదనతో సోషల్ మీడియా నిండిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నెట్ కేబుళ్లతో ఏదైనా సమస్య ఉంటే, దాన్ని ఒక పద్ధతి ప్రకారం పరిష్కరించాలని, అంతేకానీ ఇలా మొత్తం తొలగించడం సరికాదని హితవు పలికారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే ప్రజలు ఇలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తోందని కేటీఆర్ విమర్శించారు. 
KTR
K Taraka Rama Rao
Revanth Reddy
Telangana
BRS
Internet Disruption
TGSPDCL
Cable Wires Cut
Work From Home
Online Services

More Telugu News