Ramesh Gupta: నేటి నుంచి భూమండలం చల్లగా.. వాతావరణ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!

Ramesh Gupta clarifies Earth cooling rumors
  • నేటి నుంచి భూమండలం చల్లగా మారుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు
  • అఫెలియన్ కారణంగా భూమిపై తీవ్రమైన చలికాలం రాదన్న శాస్త్రవేత్తలు 
  • సోషల్ మీడియా ప్రచారం తప్పుడు సమాచారంగా వెల్లడి
సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. దాని ప్రకారం, భూమి సూర్యునికి అత్యంత దూరంగా వెళ్ళే అఫెలియన్ కారణంగా బుధవారం నుంచి ఆగస్టు 22 లేదా 25 వరకు భూమి గణనీయంగా చల్లబడుతుందని, ఫలితంగా ప్రజలు జలుబు, గొంతు నొప్పి, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

సాధారణంగా భూమికి, సూర్యుడికి మధ్య దూరం 90,000,000 కిలోమీటర్లు. కానీ ఈ అఫెలియన్ సమయంలో భూమికి, సూర్యుడికి మధ్య దూరం 152,000,000 కిలోమీటర్లకు పెరుగుతుందని, దీంతో సూర్యుడి ప్రభావం తగ్గి భూమి చల్లగా మారుతుందని సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగా చాలా మంది ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అయితే ఈ వార్తలకు శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు తేల్చిచెప్పారు.

భారత వాతావరణ శాఖ మాజీ శాస్త్రవేత్త డా. రమేశ్ గుప్తా ఈ విషయంపై స్పందిస్తూ.. ‘అఫెలియన్ అనేది భూమి సూర్యునికి కొద్దిగా దూరంగా ఉండే సహజ స్థితి మాత్రమే. భూమి సూర్యునికి సగటున 149.6 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అఫెలియన్ సమయంలో ఇది కేవలం 3 శాతం మాత్రమే పెరుగుతుంది, ఇది గణనీయమైన మార్పు కాదు’ అని పేర్కొన్నారు. అఫెలియన్ ఈ ఏడాది జులై 5న సంభవించిందని, ప్రస్తుతం భూమి మళ్లీ సూర్యునికి క్రమంగా దగ్గరగా వెళ్తున్నదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ చిన్న మార్పు వలన భూమిపై తాత్కాలికంగా గణనీయమైన ఉష్ణోగ్రత తేడాలు రావడం సాధ్యం కాదని వారు తెలిపారు.

భూమి యొక్క అక్ష వాలుదల (23.5°), భూమిపై ఋతువులు మరియు వాతావరణ మార్పులకు ప్రధాన కారణమని, సూర్యునికి దూరం కంటే ఇది ఎక్కువ ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఈ తరహా సోషల్ మీడియా పోస్టులను విచారించకుండా నమ్మవద్దని, అధికారిక వాతావరణ సంస్థల సమాచారాన్నే నమ్మాలని ప్రజలకు వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. 
Ramesh Gupta
Earth cooling
Aphelion effect
Climate change
Weather updates
IMD
Indian Meteorology Department
Seasonal changes
Earth's orbit

More Telugu News