New law: జైలుకెళ్తే పదవి ఊస్ట్.. ప్రజాప్రతినిధులపై కేంద్రం కొత్త చట్టం

Centres Bills For Removal Of PM Chief Ministers Arrested On Serious Charges
  • తీవ్రమైన కేసుల్లో అరెస్ట్ అయితే పదవి కోల్పోయేలా కొత్త బిల్లు
  • ప్రధాని, సీఎంలు, మంత్రులకు వర్తించనున్న నిబంధన
  • వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే పదవి ఆటోమేటిక్‌గా రద్దు
  • కనీసం ఐదేళ్ల శిక్ష పడే కేసులకు ఈ చట్టం వర్తింపు
  • పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టనున్న హోం మంత్రి అమిత్ షా
తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్టయి జైలుకు వెళ్లే ప్రజాప్రతినిధుల పదవులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు ఎవరైనా సరే.. తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే, వారి పదవి వాటంతట అదే రద్దయ్యేలా కొత్త బిల్లును రూపొందించింది. ఈ కీలక బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, ఒక ప్రజాప్రతినిధి కోర్టులో దోషిగా తేలితేనే పదవిని కోల్పోతారు. అయితే, ప్రతిపాదిత కొత్త చట్టం ప్రకారం కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసులో అరెస్ట్ అయి, వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంటే.. 31వ రోజున వారు స్వయంగా రాజీనామా చేయాలి లేదా వారి పదవి ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. హత్య, భారీ అవినీతి వంటి తీవ్రమైన నేరాలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.

ఈ చట్టం కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 75, 164, 239AA లకు సవరణలు చేయనున్నారు. గతేడాది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, దాదాపు ఆరు నెలల పాటు జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా నిరోధించేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా అరెస్ట్‌కు ముందే రాజీనామా చేస్తుంటారు.

ఈ బిల్లుతో పాటు, కేంద్రపాలిత ప్రాంతాల (సవరణ) బిల్లు 2025, జమ్మూకశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2025లను కూడా సభ ముందుకు తీసుకురానున్నారు. ఈ బిల్లులను పార్లమెంటరీ కమిటీకి పంపే అవకాశం ఉంది. కాగా, ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ కొత్త చట్టంపై విపక్షాలు ఇంకా స్పందించలేదు. తమ వ్యూహాన్ని చర్చించేందుకు ఈ రోజు ఉదయం సమావేశం కావాలని నిర్ణయించాయి.
New law
Amit Shah
Public representatives
Criminal cases
Arrest
Arvind Kejriwal
Delhi liquor scam
Government
Lok Sabha
Political reform

More Telugu News