Ameesha Patel: అమీషా పటేల్ బ్యాగుల పిచ్చి..!

Ameesha Patels Bag Obsession Revealed
  • బాలీవుడ్ నటి అమీషా పటేల్ వద్ద 400 లగ్జరీ బ్యాగుల భారీ కలెక్షన్
  • ఒక్క బ్యాగ్ విలువ రూ. 60-70 లక్షల వరకు అంచనా
  • బ్యాగులు కొనకుంటే ముంబైలో పెంట్‌హౌస్ కొనేదాన్నన్న నటి
  • లక్షలు విలువ చేసే షూస్, వాచీల సేకరణ కూడా
తెలుగు ప్రేక్షకులకు ‘బద్రి’ సినిమాతో సుపరిచితురాలైన బాలీవుడ్ నటి అమీషా పటేల్ తన విలాసవంతమైన హ్యాండ్‌బ్యాగ్‌ల సేకరణతో మరోసారి వార్తల్లో నిలిచారు. తన దగ్గరున్న బ్యాగులన్నీ కొనకుండా ఉండుంటే, ఆ డబ్బుతో ముంబైలో ఓ పెద్ద పెంట్‌హౌస్‌నే కొనుగోలు చేసేదాన్నని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్, తన యూట్యూబ్ ఛానెల్ కోసం అమీషా ఇంటికి వెళ్లగా, ఈ ఖరీదైన సేకరణకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అమీషా పటేల్ వద్ద దాదాపు 300 నుంచి 400 లగ్జరీ హ్యాండ్‌బ్యాగులు ఉన్నాయి. వీటిలో హెర్మెస్ బిర్కిన్, చానెల్, లూయీ విట్టన్, గూచీ, డియోర్ వంటి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్‌లు ఉన్నాయి. ఈ సేకరణలో అత్యంత ఖరీదైన ఒక క్రాక్ బిర్కిన్ బ్యాగ్ ధర సుమారు రూ. 60 నుంచి 70 లక్షల వరకు ఉంటుందని అమీషా స్వయంగా తెలిపారు. కొన్ని బ్యాగుల విలువ అయితే రూ. 2-3 కోట్ల వరకు కూడా ఉంటుందని సమాచారం. ఈ బ్యాగులన్నీ తనకు పిల్లల్లాంటివని, చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ఆమె చెప్పారు. పరిమిత ఎడిషన్ బ్యాగులు కావడంతో వాటిని ఎంతో అపురూపంగా దాచుకుంటానని అన్నారు.

బ్యాగులతో పాటు అమీషాకు ఖరీదైన షూస్, వాచ్‌ల సేకరణ కూడా ఉంది. ఆమె వార్డ్‌రోబ్‌లో గూచీ, లూయీ విట్టన్ వంటి బ్రాండ్‌లకు చెందిన రంగురంగుల షూస్ ఉన్నాయి. ఒక్కో జత షూ ధర రూ. 80 వేల నుంచి లక్షకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఈ షూస్‌ను చూసిన ఫరా ఖాన్ సరదాగా "వీటిని ఆత్మరక్షణకు వాడొచ్చు" అని అనగా, "ఎవరైనా దొంగ నా ఇంట్లోకి వస్తే వీటితోనే కొడతాను" అని అమీషా నవ్వుతూ బదులిచ్చారు.

‘కహో నా... ప్యార్ హై’ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన అమీషా, ‘గదర్’, ‘హమ్రాజ్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. గతేడాది విడుదలైన ‘గదర్ 2’ కూడా బాక్సాఫీస్ వద్ద రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయాన్ని అందుకుంది. తెలుగులో ఆమె పవన్ కల్యాణ్ సరసన ‘బద్రి’ చిత్రంలో పోషించిన సరయు పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఆ తర్వాత మహేశ్ బాబు సరసన నాని చిత్రంలోనూ, ఎన్టీఆర్ చిత్రం నరసింహుడులోనూ, బాలకృష్ణతో 'పరమవీర చక్ర' చిత్రంలోనూ నటించారు.
Ameesha Patel
Ameesha Patel bags
Bollywood actress
Luxury handbags collection
Farah Khan
Gadar 2
Badri movie

More Telugu News