Ketireddy Pedda Reddy: తాడిపత్రికి వీసా కావాలా?.. ప్రజలు అడ్డుకుంటే నా ఇల్లు రాసిస్తా: జేసీపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్

Ketireddy Pedda Reddy Fires at JC on Tadipatri Entry
  • తాడిపత్రిలోకి రాకుండా తనను అడ్డుకుంటున్నారన్న కేతిరెడ్డి
  • పోలీసులను అడ్డుపెట్టుకుని జేసీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణ
  • అభివృద్ధిలో పోటీ పడాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్
అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. తాడిపత్రికి వెళ్లాలంటే వీసా ఏమైనా తీసుకోవాలా? అని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకుని, తనను నియోజకవర్గంలోకి అడుగుపెట్టనీయకుండా చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అనంతపురంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... పోలీసుల అండతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని, అధికారులు ఆయన చేతిలో బందీలుగా మారారని ఆరోపించారు. తాను ఎక్కడికి వెళ్లినా పోలీసులు తనను అనుసరిస్తున్నారని, తనపై ఆంక్షలు విధించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో వైసీపీ నేతలపై జేసీ వర్గీయులు దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

రాజకీయ కక్ష సాధింపులు మానుకుని, దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడాలని జేసీకి సవాల్ విసిరారు. తాడిపత్రిలో జరుగుతున్న అరాచకాలపై సిట్ తో విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విచారణ జరిగితే తాడిపత్రిలో ఎవరు దౌర్జన్యాలు చేస్తున్నారో, ఎవరు అరాచకాలు సృష్టిస్తున్నారో తేలిపోతుందని స్పష్టం చేశారు.

తాడిపత్రి ప్రజలు తనను వ్యతిరేకించడం లేదని, గత ఎన్నికల్లో తనకు 80 వేల ఓట్లు వచ్చాయని కేతిరెడ్డి గుర్తుచేశారు. ప్రజలు కనుక తనను నిజంగా అడ్డుకుంటే, తన ఇల్లు రాసిస్తానని, కానీ పోలీసుల సాయంతో టీడీపీ నేతలే ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జేసీ వర్గీయులు ప్రజల నుంచి అక్రమ వసూళ్లు మానుకోవాలని హితవు పలికారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తనను తాడిపత్రిలోకి అనుమతించకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
Ketireddy Pedda Reddy
JC Prabhakar Reddy
Tadipatri
Anantapur
Andhra Pradesh Politics
YSRCP
TDP
Political rivalry
Police
Political Violence

More Telugu News