Kolikapudi Srinivasarao: అమరావతి జోలికొస్తే పాతాళానికి తొక్కుతాం: జగన్‌ కు కొలికపూడి వార్నింగ్

Kolikapudi Srinivas Warns Jagan on Amaravati Comments
  • పసికూన అమరావతిని నాశనం చేయాలని చూడొద్దన్న కొలికపూడి
  • విషపు రాతలతో జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపాటు
  • అమరావతిపై చర్చకు రావాలని జగన్ కు సవాల్
వైసీపీ అధినేత జగన్ అమరావతిపై ఉద్దేశపూర్వకంగా విషపు ప్రచారం చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఇప్పుడే పుట్టిన పసికూన లాంటి అమరావతిని నాశనం చేయాలని చూస్తే, రైతులు ఉద్యమించి జగన్‌ను పాతాళంలోకి తొక్కేస్తారని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అమరావతి మునిగిపోయిందంటూ జగన్ తన మీడియా ద్వారా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. "400 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరమే చిన్నపాటి వర్షానికి అతలాకుతలం అవుతోంది. అలాంటిది, కొత్తగా నిర్మిస్తున్న అమరావతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్న జగన్ ఇల్లు మునిగిందా?" అని కొలికపూడి సూటిగా ప్రశ్నించారు. అమరావతి అంశంపై చర్చకు తాను సిద్ధమని, జగన్ లేదా వైసీపీ నుంచి ఎవరైనా రావొచ్చని ఆయన సవాల్ విసిరారు.

గతంలో చంద్రబాబు ముందుచూపుతో నిర్మించిన కొండవీటి వాగు ద్వారానే వరద నీరు నదిలోకి వెళుతోందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా, 2019లో వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణే రాయపూడిలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించిన విషయాన్ని జగన్ మరిచిపోయారా అని నిలదీశారు. ప్రకృతి విపత్తులు ఎక్కడైనా సంభవిస్తాయని, ముంబై, జమ్మూ కశ్మీర్ వరదలే ఇందుకు నిదర్శనమని అన్నారు.

మరోవైపు, కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు బస్టాండ్ నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న 'స్త్రీ శక్తి' ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళా ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం వల్ల తిరువూరు నుంచి విజయవాడకు రానుపోను రూ. 240 ఆదా అవుతున్నాయని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వైద్యం, చదువుల కోసం తరచూ విజయవాడకు వెళ్లే తమకు ఈ పథకం ఎంతో లబ్ధి చేకూరుస్తోందని వారు ఎమ్మెల్యేకు వివరించారు. 
Kolikapudi Srinivasarao
Jagan Mohan Reddy
Amaravati
TDP
Andhra Pradesh
AP Politics
Free Bus Travel
Stree Shakti
Botsa Satyanarayana
Chandrababu Naidu

More Telugu News