కిషన్ రెడ్డి, బండి సంజయ్‌పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం

  • తెలంగాణకు రావాల్సిన యూరియా వాటాను ఇవ్వడం లేదని విమర్శ
  • యూరియాను తీసుకువచ్చే బాధ్యతను కేంద్రమంత్రులు తీసుకోవాలని డిమాండ్
  • బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో యూరియాను అడ్డుకుంటున్నాయని ఆరోపణ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన యూరియా వాటాను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ యూరియాను రాష్ట్రానికి తీసుకువచ్చే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.

యూరియా కోసం రైతులు ఇక్కడ ఆందోళన చేస్తుంటే కిషన్ రెడ్డి ఢిల్లీలో నిద్రపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు యూరియా కోసం కేంద్రానికి లేఖలు రాశారని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ లు లోపాయికారి ఒప్పందంతో యూరియాను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.


More Telugu News