Rajasthan: మరో 'బ్లూ డ్రమ్' హత్య.. యూపీ ఘటనను గుర్తుచేస్తున్న దారుణం!

Mans Body Found In Blue Drum In Rajasthan Wife And Her Lover Detained
  • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
  • మృతదేహాన్ని నీలి రంగు డ్రమ్ములో దాచిపెట్టిన వైనం
  • శరీరం కుళ్లిపోవడానికి ఉప్పు చల్లిన నిందితులు
  • రాజస్థాన్‌లోని ఖైర్తల్-తిజారాలో వెలుగుచూసిన ఘటన
  • దుర్వాసన రావడంతో బయటపడిన దారుణ హత్య
రాజస్థాన్‌లోని ఖైర్తల్-తిజారా జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో, ఓ మహిళ తన ప్రియుడితో కలిసి... కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఓ నీలి రంగు డ్రమ్ములో కుక్కి, ఇంటి పైకప్పు మీద దాచిపెట్టింది. దుర్వాసన రావడంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఈ దారుణం బయటపడింది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన హన్స్‌రామ్, తన భార్య సునీత, ముగ్గురు పిల్లలతో కలిసి ఖైర్తల్-తిజారాలో ఓ ఇంటి పైగదిలో అద్దెకు ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఓ ఇటుక బట్టీలో కూలీగా పనిచేస్తున్నాడు. అయితే, హన్స్‌రామ్ భార్య సునీతకు ఇంటి యజమాని కుమారుడైన జితేంద్రతో వివాహేతర సంబంధం ఏర్పడింది. జితేంద్ర భార్య 12 ఏళ్ల కిందట చనిపోయింది.

ఈ క్రమంలో, శనివారం నుంచి హన్స్‌రామ్ కనిపించకుండా పోయాడు. అదే రోజు సునీత తన ముగ్గురు పిల్లలను తీసుకుని ప్రియుడు జితేంద్రతో కలిసి పరారైంది. ఆదివారం వారి అద్దె ఇంటి పైనుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పైకప్పు మీద ఉన్న నీలి రంగు డ్రమ్మును తెరిచి చూడగా, అందులో హన్స్‌రామ్ మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది.

పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం త్వరగా కుళ్లిపోయి, ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు శరీరం మొత్తం ఉప్పు చల్లినట్లు తెలిపారు. పరారీలో ఉన్న సునీత, జితేంద్రలను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ఈ ఏడాది మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన 'బ్లూ డ్రమ్' హత్య కేసును ఈ ఘటన గుర్తుచేస్తోంది. అక్కడ కూడా ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి సిమెంట్‌తో కలిపి డ్రమ్ములో దాచిపెట్టిన విషయం తెలిసిందే.
Rajasthan
Hansram murder
Rajasthan crime
Khairthal Tijara
extra marital affair murder
blue drum murder
Sunita
Jitendra
Uttar Pradesh crime
crime news

More Telugu News