Murali Naik: తెలుగు వీర జవాన్ మురళీ నాయక్ జీవిత కథతో పాన్ ఇండియా సినిమా.. హీరోగా ఎవ‌రంటే..!

Actor Gautam Krishna to play lead in biopic of army braveheart Murali Naik
  • దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుడు మురళీ నాయక్ బయోపిక్ ప్రకటన
  • హీరోగా నటించనున్న యువ నటుడు గౌతమ్ కృష్ణ
  • విశాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం
  • ఒక తెలుగు సైనికుడిపై వస్తున్న మొట్టమొదటి బయోపిక్ ఇదేనన్న చిత్రబృందం
  • 'ఆపరేషన్ సిందూర్‌'లో వీరమరణం పొందిన మురళీ నాయక్
తెలుగు చిత్రసీమలో ఒక ఆసక్తికరమైన, దేశభక్తిని చాటే ప్రయత్నానికి అడుగులు పడ్డాయి. సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన ఏపీకి చెందిన అమర జవాన్ మురళీ నాయక్ జీవిత కథ ఆధారంగా ఒక బయోపిక్‌ను నిర్మించనున్నట్లు విశాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది. యంగ్ హీరో గౌతమ్ కృష్ణ ఈ చిత్రంలో మురళీ నాయక్ పాత్రను పోషించనున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటుడు గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ, "ఇది కేవలం ఒక సినిమా కాదు. ఒక నిజమైన హీరో కథ. ఇప్పటివరకు తెలుగు సైనికుడి జీవితంపై ఒక్క బయోపిక్ కూడా రాలేదు. ఇదే తొలి ప్రయత్నం. మురళీ నాయక్ వంటి సైనికులు సరిహద్దుల్లో పోరాడటం వల్లే మనం ఇక్కడ సంతోషంగా ఉండగలుగుతున్నాం" అని అన్నారు. ‘సోలో బాయ్’ సినిమా విడుదల సమయంలోనే మురళీ నాయక్ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడానని, అప్పుడే ఆయన గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నానని గౌతమ్ గుర్తుచేసుకున్నారు.

భారతదేశ చరిత్రలో 'ఆపరేషన్ సిందూర్' ఒక కీలకమైన ఘట్టమని, ఆ యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందిన మురళీ నాయక్ కథ ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. "ఆయన కథ చెబుతున్నప్పుడే నాకు కన్నీళ్లు ఆగలేదు. ఇంతటి గొప్ప గాథను తెరపైకి తీసుకొచ్చే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన తల్లిదండ్రులను అనుమతి కోరగా, వారు ఏమాత్రం ఆలోచించకుండా అంగీకరించారు. 'మా అబ్బాయి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపించండి. అతడిని ఈ దేశానికి పరిచయం చేయండి' అని వారు కోరారు" అని గౌతమ్ భావోద్వేగంగా తెలిపారు.

నిర్మాత కె. సురేశ్‌ బాబు మాట్లాడుతూ, "మురళీ నాయక్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. దేశం కోసం ఆయన చేసిన త్యాగం గొప్పది. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ గర్వపడేలా చేస్తుంది. ఆయన కథను పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు అందిస్తాం" అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మురళీ నాయక్ తండ్రి మాట్లాడుతూ, "ఆపరేషన్ సిందూర్‌లో మురళీ ఎంతో ధైర్యంగా పోరాడాడు. గౌతమ్ బాబు అతనిపై మంచి సినిమా తీయాలి. ఈ సినిమా భారతీయులందరి హృదయాల్లో నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. మురళీ పాత్రలో గౌతమ్‌ను చూడటం మాకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు. ఆయన సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
Murali Naik
Gautam Krishna
Operation Sindoor
Indian Army
biopic movie
Telugu movie
Pan India movie
Vishaan Film Factory
AP soldier
martyr

More Telugu News