Assam Government: ఒక జిల్లాను రాసిచ్చేశారా?: అసోం సర్కారుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

High Court Outraged Over Assam Govt Land Allotment to Cement Firm
  • అసోంలో ప్రైవేట్ కంపెనీకి భారీగా భూ కేటాయింపు
  • మహాబల్ సిమెంట్స్‌కు 3000 బీఘాల బదలాయింపుపై వివాదం
  • ప్రభుత్వ నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేసిన గౌహతి హైకోర్టు
అసోంలోని డిమా హసావో జిల్లాలో మహాబల్ సిమెంట్స్ అనే ప్రైవేట్ సంస్థకు ఏకంగా 3,000 బీఘాల (దాదాపు 992 ఎకరాలు) భూమిని కేటాయించడంపై గౌహతి హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అసాధారణమైనదిగా అభివర్ణించిన న్యాయస్థానం, "ఇదేమైనా జోకా? ఒక జిల్లా మొత్తాన్ని రాసిచ్చేస్తున్నారా?" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

విచారణ సందర్భంగా జస్టిస్ సంజయ్ కుమార్ మేధి భూ కేటాయింపులను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "ఒక ప్రైవేట్ కంపెనీకి 3000 బీఘాలా? అది బీడు భూమి అయినా ఇంత పెద్ద మొత్తంలో కేటాయించడం ఏమిటి? ఇక్కడ కంపెనీకి ఎంత భూమి అవసరం అన్నది కాదు, ప్రజా ప్రయోజనమే ముఖ్యం" అని ఆయన స్పష్టం చేశారు.

ఈ భారీ భూ కేటాయింపునకు సంబంధించిన అన్ని రికార్డులు, ప్రభుత్వ విధాన పత్రాలను తమ ముందు ఉంచాలని నార్త్ కచార్ హిల్స్ అటానమస్ కౌన్సిల్ (ఎన్‌సీహెచ్‌ఏసీ)ను న్యాయస్థానం ఆదేశించింది. డిమా హసావో జిల్లా రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ పరిధిలోకి వస్తుందని, ఇక్కడి గిరిజన తెగల హక్కులు, ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోర్టు గుర్తు చేసింది.

మరోవైపు, కంపెనీ తరఫు న్యాయవాది వాదిస్తూ, అది పూర్తిగా బీడు భూమి అని, ఫ్యాక్టరీ నిర్మాణానికి అంత భూమి అవసరమని తెలిపారు. టెండర్ ద్వారా పొందిన మైనింగ్ లీజుకు కొనసాగింపుగానే ఈ కేటాయింపు జరిగిందని వివరించారు. అయితే, ఈ ప్రాజెక్టు కోసం చట్టబద్ధంగా తమకున్న భూముల నుంచి బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని పలు స్థానిక కుటుంబాలు పిటిషన్లలో ఆరోపించాయి.

ఇంత పెద్ద మొత్తంలో భూమిని ఒకే కంపెనీకి ఎందుకు కేటాయించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని అసోం ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణలోగా భూ రికార్డులు, విధాన పత్రాలను సమర్పించాలని స్పష్టం చేసింది. 
Assam Government
Gauhati High Court
land allocation
Dima Hasao district
Mahabal Cements
North Cachar Hills Autonomous Council
tribal rights
land dispute
Sanjay Kumar Medhi
Assam land scam

More Telugu News