Manthena Satyanarayana Raju: టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మంతెనకు కీలక పదవి

Manthena Satyanarayana Raju Appointed as AP CM Coordinator
  • ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్తగా నియమితులైన మంతెన సత్యనారాయణ రాజు
  • నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ విజయానంద్
  • సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన సత్యనారాయణ రాజు
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్తగా నియమితులయ్యారు. ఆయనకు సహాయ మంత్రి హోదా కల్పించారు. తదుపరి చర్యలు తీసుకోవాలని జీఏడీ, ప్రోటోకాల్ డైరెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

దాదాపు రెండు దశాబ్దాలకు పైగా టీడీపీలో క్రియాశీలకంగా పని చేసిన సత్యనారాయణ రాజు 2017-2023 మధ్య కాలంలో ఎమ్మెల్సీగా పని చేశారు. పార్టీలో వివిధ పదవులు నిర్వహించారు. 2007-2013 మధ్య కాలంలో తెలుగు యువత కార్యదర్శిగా, ఆ తర్వాత 2013లో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా వ్యవహరించి పార్టీ అధినేత చంద్రబాబు అప్పజెప్పిన పనులను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సమయంలో చంద్రబాబు నిర్వహించిన 'మీ కోసం' పాదయాత్రలో రాజు వాలంటీర్ల సమన్వయకర్తగా పని చేశారు.

శాసనమండలిలో ప్రజా సమస్యలను, పార్టీ గళాన్ని గట్టిగా వినిపించారు. గత వైసీపీ హయాంలో శాసనమండలిలో నారా లోకేశ్ నేతృత్వంలో మూడు రాజధానుల బిల్లు పాస్ కాకుండా అడ్డుకోవడంలో సత్యనారాయణ రాజు తన వంతు పాత్ర పోషించారు. అంతే కాకుండా శాసన మండలిలో నారా లోకేశ్ మీదకు నాటి అధికార పార్టీ నేతలు దూసుకొచ్చిన సమయంలో ఆయనపై దాడి జరగకుండా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్‌తో కలిసి అడ్డుకున్నారు. ఇక 2022 నుంచి పార్టీ కార్యక్రమాల సమన్వయకర్తగా వ్యవహరిస్తూ వచ్చారు.

పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల సమన్వయకర్తగానూ వ్యవహరించారు. లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్రలో కీలక భూమిక పోషించారు. చంద్రబాబు నాయుడు పాల్గొన్న 2024 ఎన్నికల సభలను కూడా మంతెన కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. పార్టీకి అత్యంత విధేయుడిగా ఉన్న రాజును తన కార్యక్రమాల సమన్వయకర్తగా చంద్రబాబు నియమించారు. 

తనను సమన్వయకర్తగా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి సత్యనారాయణ రాజు ధన్యవాదాలు తెలిపారు. సీఎం ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. మరోవైపు సీఎం కార్యక్రమాల సమన్వయకర్తగా నియమితులైన సత్యనారాయణరాజుకు పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు అభినందనలు తెలియజేస్తున్నారు. 
Manthena Satyanarayana Raju
TDP
Telugu Desam Party
Andhra Pradesh Politics
Chandrababu Naidu
Nara Lokesh
AP CM Coordinator
Political Appointment
Krishna District
Guntur District

More Telugu News