Ambati Rayudu: టీ20 ఫైనల్‌లో ఆ క్యాచ్ మిస్టరీ వీడింది.. ఏడాది తర్వాత అసలు విషయం చెప్పిన రాయుడు

Ambati Rayudus Big Revelation On Suryakumar Yadavs T20 WC Final Catch
  • బ్రాడ్‌కాస్టర్ల కోసమే బౌండరీ రోప్‌ను వెనక్కి జరిపారన్న రాయుడు
  • పని అయ్యాక రోప్‌ను మళ్లీ ముందుకు జరపడం మర్చిపోయారని వెల్లడి
  • అందువల్లే బౌండరీ పెద్దదై భారత్‌కు మేలు జరిగిందని వ్యాఖ్య
  • అదంతా దేవుడి ప్లాన్ అని, క్యాచ్ మాత్రం క్లీన్ అని వివరణ 
గతేడాది టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఆ ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ ఆటను మలుపు తిప్పింది. డేవిడ్ మిల్లర్‌ను ఔట్ చేసేందుకు సూర్య పట్టిన ఆ క్యాచ్‌పై అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. బౌండరీ రోప్‌ను ఉద్దేశపూర్వకంగా వెనక్కి జరిపారనే ఆరోపణలు వచ్చాయి. అయితే, సరిగ్గా ఏడాది తర్వాత ఆ ఘటన వెనుక ఉన్న అసలు విషయాన్ని భారత మాజీ ఆటగాడు, ఆ మ్యాచ్ కామెంటేటర్ అంబటి రాయుడు బయటపెట్టాడు.

ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ విషయంపై రాయుడు స్పందించాడు. "మ్యాచ్ బ్రేక్ సమయంలో వరల్డ్ ఫీడ్ కామెంటేటర్ల సౌకర్యం కోసం ఆ ప్రదేశంలో ఒక కుర్చీ, స్క్రీన్ ఏర్పాటు చేస్తారు. దానికోసం వాళ్లు బౌండరీ రోప్‌ను కొంచెం వెనక్కి జరిపారు. అయితే, వాటిని తీసేశాక రోప్‌ను తిరిగి పాత స్థానంలోకి తీసుకురావడం మర్చిపోయారు. అలా మాకు తెలియకుండానే బౌండరీ సైజ్ కొంచెం పెద్దదైంది. ఈ విషయాన్ని మేం పైనుంచి గమనించాం. అదంతా దేవుడి ప్లాన్" అని రాయుడు వివరించాడు.

ఒకవేళ రోప్ సాధారణ స్థితిలో ఉండుంటే అది సిక్స్ అయ్యేదా? అని అడగ్గా, "అది సిక్స్ అయ్యేదో లేదో కచ్చితంగా చెప్పలేను. బహుశా రోప్ మామూలుగా ఉండుంటే, సూర్య లోపలి నుంచే పరుగెత్తుకుంటూ వచ్చి ఆ క్యాచ్ అందుకునేవాడేమో" అని రాయుడు అభిప్రాయపడ్డాడు.

ఏదేమైనా, ఆ క్యాచ్‌లో ఎలాంటి సందేహం లేదని, అది క్లీన్ క్యాచ్ అని రాయుడు స్పష్టం చేశారు. "చివరికి దేవుడు మనవైపే ఉన్నాడు" అని ఆయన తేల్చేశాడు. కాగా, ఆ క్యాచ్ పట్టిన సమయంలో కొందరు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు బౌండరీ రోప్ ప్లేస్‌మెంట్‌పై సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ, భారత్ విజయం తర్వాత ఆ వివాదం కొన్నాళ్లకే సద్దుమణిగింది. ఇప్పుడు రాయుడు వ్యాఖ్యలతో ఆ ఘటనపై పూర్తి స్పష్టత వచ్చినట్లయింది.
Ambati Rayudu
T20 World Cup
Suryakumar Yadav catch
David Miller wicket
India vs South Africa
boundary rope controversy
cricket match
T20 final
cricket news
Ambati Rayudu interview

More Telugu News