Chandrababu Naidu: వైసీపీ విష ప్రచారాన్ని తిప్పికొట్టండి: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు

Chandrababu Naidu Calls TDP Cadre to Counter YSRCPs False Propaganda
  • వైసీపీ తప్పుడు ప్రచారాలపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు
  • ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమే ప్రతిపక్షం పని అని వ్యాఖ్య
  • ‘సుపరిపాలనలో తొలి అడుగు’ విజయవంతమైందన్న సీఎం
  • కోటి 24 లక్షల కుటుంబాలను నేరుగా కలిశామని వెల్లడి
  • పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ
  • నేతలు, కార్యకర్తలు మరింత బాధ్యతగా, క్రమశిక్షణతో మెలగాలని సూచన
రాష్ట్రంలో వైసీపీ నిత్యం విషం చిమ్ముతూ, తప్పుడు ప్రచారాలతో ప్రజలను గందరగోళపరిచే కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు  తీవ్రంగా విమర్శించారు. రాజధాని మునిగిపోయిందని, ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయని అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమే వారి సిద్ధాంతమని ఆరోపించారు. సోమవారం నాడు పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు సమర్థంగా తిప్పికొట్టాలని, ఈ విషయంలో మంత్రులు, పార్టీ నేతలు మరింత చొరవ చూపాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

"రాష్ట్రంలో ఒక నేర చరిత్ర కలిగిన పార్టీ ఉంది. వాళ్ల పని నిత్యం విషం చిమ్మడం, తప్పుడు ప్రచారం చేయడమే వారి పని. సోషల్ మీడియా, సొంత టీవీ, పత్రికల్లో, అనుబంధ మీడియాతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. రాజధాని కోసం పొన్నూరును ముంచారని ఒకసారి, కొండవీటి వాగు ఎత్తిపోతల పంపులు పని చేయడంలేదని మరోసారి... ప్రకాశం బ్యారేజ్ ప్రమాదంలో పడిందని ఇంకోసారి వార్తలు వేశారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను గందరగోళ పరచాలి అనే సిద్దాంతంతోనే వైసీపీ రోజూ పనిచేస్తోంది. వైసీపీ చేస్తున్న ఏ ప్రచారాన్ని పరిశీలించినా వాళ్ల కుట్ర ఏంటో అర్థం అవుతుంది. తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించాలి... మంత్రులు, పార్టీ నేతలు ఈ విషయంలో మరింత చొరవ చూపాలి. లేకపోతే ప్రజలు ఆ తప్పుడు ప్రచారాలనే నిజం అని నమ్మే స్థాయికి తీసుకువెళతారు. మంచి గురించి మాట్లాడడమే కాదు... చెడు చేసే వారి గురించి కూడా ప్రజలను చైతన్య పరచాలి. మనపై చేసే అసత్య ప్రచారాలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంఛార్జ్‌లు, కార్యకర్తలు మరింత క్రమశిక్షణతో ఉండాలి" అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 

ప్రభుత్వం చేపట్టిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం విజయవంతమైందని చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.24 కోట్ల కుటుంబాలను నేరుగా కలిసి, ప్రభుత్వ పథకాలను వివరించామని అన్నారు. సాంకేతికతను ఉపయోగించుకుని నాయకుల పర్యటనలను పర్యవేక్షించామని... ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంఛార్జ్‌లు ఏ గ్రామానికి ఏ సమయంలో వెళుతున్నారో యాప్ ద్వారా తెలుసుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల్లో పూర్తి సంతృప్తి, సానుకూలత వ్యక్తమవుతోందని, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్-6 హామీలను అమలు చేస్తుండటంతో ప్రజలు ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, అదే సమయంలో చెడు చేసే వారి గురించి కూడా ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతల మాటలు, చేతలు పార్టీకి గానీ, ప్రభుత్వానికి గానీ చెడ్డపేరు తెచ్చేలా ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ మరింత బాధ్యతగా, క్రమశిక్షణతో వ్యవహరించాలని, వివాదాలకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వొద్దని హెచ్చరించారు.

పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇప్పటికే వ్యవసాయ మార్కెట్ కమిటీలు, కార్పొరేషన్లకు ఛైర్మన్‌లను నియమించామని, త్వరలోనే మిగిలిన నామినేటెడ్ పదవులను కూడా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన నేతలు, కార్యకర్తలను ఆయన అభినందించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడం వల్లే ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేశారని, ఇది రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు.
Chandrababu Naidu
TDP
YSRCP
Andhra Pradesh Politics
False Propaganda
AP Government Schemes
Telugu Desam Party
Political News
Super Six Promises
AP Elections

More Telugu News