Chandrababu Naidu: అమరావతికి కొత్త రూపు... సీఆర్డీఏ సమావేశంలో చంద్రబాబు సర్కార్ కీలక అడుగులు

Chandrababu Naidu Focuses on New Look for Amaravati
  • రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులకు రూ.904 కోట్ల కేటాయింపు
  • మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుకు భూ సమీకరణకు ఆమోదం
  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశంలో 9 ప్రతిపాదనలకు ఆమోదముద్ర
  • అమరావతిలోని కీలక ప్రాజెక్టుల కోసం ప్రత్యేక ఎస్పీవీల ఏర్పాటు
  • విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు అదనంగా చెరొక 100 ఎకరాలు
రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్ వంతెనకు అద్భుతమైన డిజైన్ ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సంప్రదాయ కూచిపూడి నృత్య భంగిమ సహా వేర్వేరు నూతన డిజైన్లను పరిశీలించాలని సూచించారు. సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 51వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం 9 ప్రతిపాదనలకు ఆమోదం తెలియచేసింది. 

రాజధాని అమరావతిలో చేపట్టే వివిధ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు ప్రత్యేక వాహక సంస్థ ఏర్పాటుకు సీఆర్డీఏ అథారిటీ తన ఆమోదాన్ని తెలియచేసింది. రాజధానిలో చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు, స్పోర్ట్స్ సిటీ , స్మార్ట్ ఇండస్ట్రీస్, రివర్ ఫ్రంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, రోప్ వే లాంటి ప్రాజెక్టులకు ఎస్పీవీ ఏర్పాటు చేసేందుకు అంగీకారాన్ని తెలిపింది. 

మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ లో జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్కు ఏర్పాటుకు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద భూ సమీకరణ చేసేందుకు కూడా అథారిటీ ఆమోదించింది. మంగళగిరిలోని ఆత్మకూరు వద్ద 78 ఎకరాల్లో గోల్డ్ క్లస్టర్ ను ఏర్పాటు చేసేందుకు భూ సమీకరణ చేయాలన్న సీఆర్డీఏ ప్రతిపాదనకు అథారిటీ అమోదాన్ని తెలియచేసింది. దీని కోసం ప్రత్యేకంగా ఎల్పీఎస్ నిబంధనలకు కూడా అథారిటీ ఆమోదించింది. గోల్డ్ క్లస్టర్ వద్ద ప్రత్యేక ఎకో సిస్టం వచ్చేలా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రూ.5 వేల కోట్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని.. 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని సీఆర్డీఏ అథారిటి అభిప్రాయం వ్యక్తం చేసింది. 

రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామ పంచాయితీల్లో డ్రెయిన్లు, నీటి సరఫరా ఇతర మౌలిక సదుపాయాల కోసం ఎల్పీఎస్ జోన్స్ క్రిటికల్ ఇన్ ఫ్రా అండ్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ కింద రూ.904 కోట్లతో పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. భూసమీకరణ పథకం కింద ఇచ్చే యాజమాన్య ధృవీకరణ సర్టిఫికెట్‌లో అసైన్డ్ అనే పదాన్ని తొలగిచేందుకు కూడా సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలిపింది. అమరావతి రాజధాని నగరంలో సీవరేజ్ వాటర్ ట్రీట్ మెంట్  ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రూ. 411 కోట్లు, అలాగే వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను రూ. 376.60 కోట్లతో ఏర్పాటు చేసేందుకు అథారిటీ అంగీకరించింది. 

విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు కూడా అదనపు భూ కేటాయింపులు చేసేందుకు సీఎం అధ్యక్షతన అథారిటీ ఆమోదం తెలిపింది. విట్‌కు 100 ఎకరాలు, ఎస్ఆర్ఎంకు 100 ఎకరాల చొప్పున అదనపు భూ కేటాయింపులకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది.  

ఈ సీజన్‌లోనే రాజధానికి ఒక రూపం
 
రాజధానిలో చేపట్టే నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. పనుల వివరాలను ఎప్పటికప్పుడు తెలియచేసేలా ఆన్ లైన్ లో ఉంచాలని అన్నారు. ఈ సీజన్‌లోనే నిర్మాణాలు పూర్తిచేసి రాజధానికి ఒక రూపం తీసుకురావాలన్నారు. ప్రత్యేక వాహక సంస్థ ద్వారా చేపట్టే స్పోర్ట్ సిటీ లాంటి ప్రాజెక్టులను అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. రివర్ ఫ్రంట్ , రోప్ వే, ఇన్నర్ రింగ్ రోడ్డులను అనుసంధానించాలని సీఎం సూచించారు. 

రాజధాని ప్రాంతంలో కాలుష్య రహిత పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చేలా చూడాలని స్పష్టం చేశారు. త్వరలోనే ప్రతిష్ఠాత్మక బయో ఇంజినీరింగ్ యూనివర్సిటీ కూడా అమరావతికి రానుందని సీఎం పేర్కోన్నారు. దేశంలో మరే ప్రాంతానికీ లేని భౌగోళికపరమైన సానుకూలతలు అమరావతికి ఉన్నాయని... అందుకే ఇక్కడ చేపట్టే నిర్మాణాలన్నీ ఐకానిక్ గా ఉండాలని స్పష్టం చేశారు. ప్రతీ ప్రాజెక్టు పరిధిలోనూ ఆర్ధిక కార్యాకలాపాలు జరిగేలా ప్రణాళికలు ఉండాలని సీఎం సూచించారు. 

సీఆర్డీఏ అథారిటీ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సీఎస్ కె.విజయానంద్, పురపాలక, సీఆర్డీఏ, ఏడీసీకి చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Chandrababu Naidu
Amaravati
CRDA
Andhra Pradesh
Capital City
Krishna River Bridge
Land Pooling Scheme
Infrastructure Development
Gold Cluster
Greenfield Airport

More Telugu News