కోవిడ్ ఎఫెక్ట్: వయసు కంటే ముందే రక్తనాళాలకు వృద్ధాప్యం.. గుండెపోటు ముప్పుపై పరిశోధకుల హెచ్చరిక

  • కోవిడ్ సోకిన వారిలో రక్తనాళాలకు అకాల వృద్ధాప్యం
  • తేలికపాటి ఇన్ఫెక్షన్‌తోనూ గుండె, పక్షవాతం ముప్పు
  • పురుషుల కంటే మహిళల ధమనులపైనే తీవ్ర ప్రభావం
  • లాంగ్ కోవిడ్ బాధితుల్లో ఈ సమస్య మరింత ఎక్కువ
  • వ్యాక్సిన్ తీసుకున్నవారిలో రక్తనాళాలు మెరుగ్గా ఉన్నట్టు గుర్తింపు
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించి ఏళ్లు గడుస్తున్నా, దాని దీర్ఘకాలిక ప్రభావాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా జరిపిన ఒక విస్తృత స్థాయి అధ్యయనంలో కోవిడ్ ఇన్ఫెక్షన్, అది తేలికపాటిది అయినా సరే, మన రక్తనాళాలను వయసు కంటే ముందే బలహీనపరిచి, గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల ముప్పును పెంచుతున్నట్లు వెల్లడైంది. ఈ ప్రభావం పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.

ఫ్రాన్స్‌లోని పారిస్ సిటీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రోసా మరియా బ్రూనో నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. 16 దేశాలకు చెందిన సుమారు 2,390 మందిపై సెప్టెంబర్ 2020 నుంచి ఫిబ్రవరి 2022 మధ్య పరిశోధనలు జరిపారు. "కోవిడ్ వైరస్ నేరుగా రక్తనాళాలపై ప్రభావం చూపుతుందని మాకు తెలుసు. దీనివల్ల రక్తనాళాలు వయసు కంటే వేగంగా వృద్ధాప్యానికి గురవుతాయి. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది" అని ప్రొఫెసర్ బ్రూనో వివరించారు. ఈ అధ్యయన ఫలితాలను ప్రతిష్ఠాత్మక యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురించారు.

కోవిడ్ సోకని వారితో పోలిస్తే, ఇన్ఫెక్షన్‌కు గురైన వారందరిలో... ముఖ్యంగా మహిళలు, లాంగ్ కోవిడ్ లక్షణాలతో (ఆయాసం, అలసట వంటివి) బాధపడుతున్న వారిలో రక్తనాళాలు లేదా ధమనులు గట్టిపడినట్లు ఈ అధ్యయనంలో స్పష్టంగా తేలింది. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ధమనులు అంతగా గట్టిపడలేదని, వారి పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని కూడా పరిశోధకులు గుర్తించారు.

మహిళల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండటానికి వారి రోగనిరోధక వ్యవస్థ పనితీరే కారణం కావచ్చని ప్రొఫెసర్ బ్రూనో అభిప్రాయపడ్డారు. "మహిళల రోగనిరోధక వ్యవస్థ వేగంగా, బలంగా స్పందిస్తుంది. ఇది ఇన్ఫెక్షన్ నుంచి వారిని కాపాడుతుంది. కానీ, అదే బలమైన స్పందన ఇన్ఫెక్షన్ తర్వాత రక్తనాళాలకు ఎక్కువ నష్టం కలిగించవచ్చు" అని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో, కోవిడ్ బారిన పడిన వారిలో గుండె సంబంధిత ముప్పును ముందుగానే గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 


More Telugu News