Nara Lokesh: ఢిల్లీలో కేంద్రమంత్రి నడ్డాతో నారా లోకేశ్ భేటీ... ఏపీకి కీలక హామీలు

Nara Lokesh Meets Nadda in Delhi Secures Key Assurances for AP
  • కేంద్రమంత్రి జేపీ నడ్డాతో మంత్రి నారా లోకేష్ భేటీ
  • ఏపీకి 29 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు
  • ఈ నెల 21 నాటికి యూరియా సరఫరా చేస్తామని హామీ
  • రాష్ట్రంలో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం
  • విశాఖ నిపర్‌కు శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయాలని వినతి
  • పోలవరం, అమరావతి పనులు మళ్లీ పట్టాలెక్కాయని వెల్లడి
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖల మంత్రి జేపీ నడ్డాతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో ముమ్మరంగా వ్యవసాయ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో యూరియా కొరత ఉందని, వెంటనే రాష్ట్రానికి అవసరమైన యూరియా కేటాయించాలని కోరారు. దీనిపై కేంద్రమంత్రి నడ్డా స్పందిస్తూ... ఈనెల 21నాటికి ఆంధ్రప్రదేశ్ కు 29 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తామని, రాష్ట్రంలో యూరియా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక పరిశ్రమల అభివృద్ధి, యువతకు ఉపాధి కోసం ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటుకు సహకారం అందించాలని మంత్రి లోకేశ్ కోరగా, జేపీ నడ్డా ఆమోదం తెలిపారు. విశాఖపట్నంలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (NIPER) శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైన 100 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని లోకేశ్ చెప్పారు. 

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 14 నెలలుగా కొనసాగతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని లోకేశ్ ఈ సందర్భంగా కేంద్రమంత్రికి వివరించారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు సహకారం అందించాలని విజ్ఞప్తిచేశారు. కేంద్రప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం, అమరావతి రాజధాని పనులు మళ్లీ పట్టాలెక్కాయని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.
Nara Lokesh
JP Nadda
Andhra Pradesh
AP Government
Urea Supply
Plastic Park
NIPER Visakhapatnam
Polavaram Project
Amaravati
AP Development

More Telugu News