Rahul Sipligunj: ప్రేయ‌సితో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న‌ సింగర్ రాహుల్ సిప్లిగంజ్

Rahul Sipligunj Secretly Engaged to Girlfriend Harini Reddy
  • నిన్న త‌న ప్రేయ‌సి హరిణి రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్న రాహుల్‌
  • హైదరాబాద్‌లో కొంతమంది అత్యంత‌ స‌న్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్
  • ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైరల్  
బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్, ఆర్ఆర్ఆర్‌లోని 'నాటు నాటు' పాట‌తో ఆస్కార్ విజేతగా నిలిచిన‌ రాహుల్ సిప్లిగంజ్ తన ప్రేయసి హరిణి రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్ తాలూకు ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ అవుతున్నాయి. నిన్న‌ వీరి ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లో కొంతమంది అత్యంత‌ స‌న్నిహితుల సమక్షంలో జరిగినట్టు స‌మాచారం. 

అయితే, రాహుల్ సిప్లిగంజ్ ప్రతి చిన్న విషయాన్ని కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. కానీ, తన జీవితంలో ఇంత ముఖ్యమైన వేడుకను మాత్రం చాలా సీక్రెట్‌గానే ఉంచడం హాట్ టాపిక్‌గా మారింది. రాహుల్ కానీ, అతని కుటుంబ సభ్యులెవరూ కూడా ఈ ఎంగేజ్‌మెంట్ ఫొటోలను అధికారికంగా విడుదల చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్‌గా మారాయి. దీంతో పలువురు అభిమానులు, నెటిజన్లు రాహుల్ సిప్లిగంజ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా, రాహుల్‌కు కాబోయే అర్ధాంగి హరిణి రెడ్డి గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిశ్చితార్థం సందర్భంగా రాహుల్- హరిణి రెడ్డి కలర్ ఫుల్ డ్రెస్సుల్లో మెరిసిపోయారు. మొత్తానికి ఈ జంట చూడముచ్చటగా ఉందంటూ  అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అలాగే తన పెళ్లిపై రాహుల్ అధికారిక ప్రకటన కోసం కూడా ఆయ‌న ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే... నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డ్ అందుకున్న రాహుల్ సిప్లిగంజ్‌కి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల చెక్‌ని అందించిన విష‌యం తెలిసిందే. 


Rahul Sipligunj
Harini Reddy
Rahul Sipligunj engagement
Naatu Naatu song
RRR movie
Big Boss Telugu
Telangana CM Revanth Reddy
Tollywood singer
Oscar winner

More Telugu News