Maharashtra accident: మహారాష్ట్ర యాక్సిడెంట్.. ఏఐ సాయంతో వాహనాన్ని గుర్తించిన పోలీసులు

Maharashtra Accident AI Helps Police Identify Vehicle
  • మహారాష్ట్రలో బైక్ పై వెళుతున్న దంపతులను ఢీ కొట్టిన ట్రక్కు
  • అక్కడికక్కడే చనిపోయిన భార్య.. మృతదేహాన్ని బైక్ పై తరలించిన భర్త
  • ట్రక్కు వివరాలు చెప్పలేకపోయిన భర్త.. ప్రాథమిక ఆధారాలతో ట్రక్కు గుర్తింపు
మహారాష్ట్రలో జాతీయ రహదారిపై బైక్ పై వెళుతున్న దంపతులను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. వాహనం టైర్ కింద పడడంతో భార్య మరణించగా.. సాయానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ భర్త ఆమె మృతదేహాన్ని బైక్ వెనుక సీటుకు కట్టుకుని, తన గ్రామానికి వెళ్లిన ఘటన ఇటీవల సంచలనంగా మారింది. ఈ ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలను భర్త చెప్పలేకపోయాడు.

భార్యను కోల్పోయిన దు:ఖంలో వాహనాన్ని సరిగా చూడలేదని పోలీసుల ముందు వాపోయాడు. వాహనం రంగు, ఇతరత్రా తనకు గుర్తున్న వివరాలను వెల్లడించాడు. నామమాత్రంగా అందిన ఈ వివరాలతోనే పోలీసులు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా కేవలం 36 గంటల్లోనే జరిగింది. ఈ కేసును సాల్వ్ చేయడానికి కృత్రిమ మేధ సాయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇలా గుర్తించారట..
ప్రమాద స్థలానికి సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వున్న టోల్ ప్లాజాలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఢీకొట్టి వెళ్లిపోయిన వాహనంపై ఎరుపు రంగు గుర్తులను చూశానని బాధితుడు చెప్పడంతో.. ప్రమాద సమయానికి కాస్త అటూఇటుగా టోల్ గేట్ దాటిన వాహనాలను గుర్తించారు. అందులో ఎరుపు రంగు ట్రక్కుల వివరాలను నోట్ చేసుకుని, ప్రత్యేకంగా పరిశీలించారు.

ఆయా ట్రక్కు డ్రైవర్లను విచారించి ప్రమాదానికి కారణమైన ట్రక్కును గుర్తించారు. ఆ సమయానకి ట్రక్కు నాగ్ పూర్ కు సుమారు 700 కిలోమీటర్ల దూరంలో గ్వాలియర్– కాన్పూర్ హైవేపై ప్రయాణిస్తున్నట్లు గుర్తించి, స్థానిక పోలీసుల సాయంతో దానిని ఆపేశారు. నాగ్ పూర్ రూరల్ పోలీసులు వెళ్లి డ్రైవర్ ను అరెస్టు చేసి తీసుకొచ్చారు.
Maharashtra accident
Accident AI
AI accident case
Nagpur police
Gwalior Kanpur highway
Hit and run case
Artificial intelligence
Crime investigation

More Telugu News