Toothpaste: మనిషి వెంట్రుకల నుంచి టూత్ పేస్ట్.. పాడైపోయిన పళ్లను రిపేర్ చేసే పేస్ట్

Human Hair Toothpaste Developed by London Kings College
  • లండన్ శాస్త్రవేత్తల వినూత్న ఆవిష్కరణ
  • మానవ వెంట్రుకల నుంచి ప్రత్యేక టూత్‌పేస్ట్ తయారీ
  • వెంట్రుకల్లోని 'కెరాటిన్' ప్రొటీన్‌తో అభివృద్ధి
  • దెబ్బతిన్న పంటి ఎనామిల్‌ను మరమ్మతు చేస్తుందని వెల్లడి
  • దంతక్షయాన్ని పూర్తిగా నివారించే శక్తి ఉందన్న పరిశోధకులు
మనిషి వెంట్రుకల నుంచి టూత్‌పేస్ట్ తయారుచేశారంటే నమ్మశక్యంగా లేదు కదూ? కానీ లండన్‌ కింగ్స్‌ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. దంత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా వారు మానవ వెంట్రుకలను ఉపయోగించి ఒక ప్రత్యేకమైన టూత్‌పేస్ట్‌ను అభివృద్ధి చేశారు. ఇది దెబ్బతిన్న దంతాలకు రక్షణ కల్పించడమే కాకుండా, వాటిని తిరిగి మరమ్మతు చేయడంలో అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

మానవ వెంట్రుకలలో సహజంగా లభించే 'కెరాటిన్' అనే ప్రొటీన్‌ను ఈ టూత్‌పేస్ట్ తయారీలో ఉపయోగించారు. ఈ ప్రొటీన్ సహాయంతో దంతాల పైపొర అయిన ఎనామిల్‌ను తిరిగి ఏర్పడేలా చేయవచ్చని తమ అధ్యయనంలో తేలినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో దంత క్షయం ఒకటి. దీనివల్ల పంటి ఎనామిల్ దెబ్బతిని, తీవ్రమైన సమస్యలు వస్తుంటాయి.

ప్రస్తుతం మనం వాడుతున్న సాధారణ టూత్‌పేస్టులు దంత క్షయం వేగాన్ని కేవలం తగ్గించగలవు గానీ, దానిని పూర్తిగా ఆపలేవని నిపుణులు అంటున్నారు. అయితే, ఈ కెరాటిన్ ఆధారిత టూత్‌పేస్ట్ మాత్రం దంత క్షయాన్ని పూర్తిగా నివారించగలదని, పాడైన పళ్లను సైతం బాగుచేయగలదని పరిశోధకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆవిష్కరణ దంత వైద్య రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. 
Toothpaste
London Kings College
Tooth repair
Human hair
Keratin
Dental health
Tooth decay
Enamel repair

More Telugu News