గ్రెగ్ చాపెల్ గొప్ప కోచ్ అయ్యేవాడు.. కానీ ఆ ఒక్క పొరపాటే కొంపముంచింది: ఇర్ఫాన్ పఠాన్

  • గ్రెగ్ చాపెల్ కోచింగ్‌పై ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • ఆటగాళ్లను పదేపదే బెదిరించొద్దని చాపెల్‌తో చెప్పాన‌న్న మాజీ క్రికెట‌ర్‌
  • ఆయన తీరుతో జట్టులో అభద్రతా భావం పెరిగిందని వెల్లడి
  • భారత సంస్కృతిని చాపెల్ గౌరవించలేదని విమర్శ
  • ఆస్ట్రేలియా కల్చర్‌ను రుద్దాలని చూడటమే సమస్యగా మారిందన్న పఠాన్
ఒకప్పటి భారత జట్టు కోచ్ గ్రెగ్ చాపెల్ గురించిన ఆసక్తికర విషయాలను టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తాజాగా బయటపెట్టాడు. చాపెల్ కోచింగ్ కాలాన్ని భారత క్రికెట్‌లో ఒక చీకటి అధ్యాయంగా చాలామంది భావిస్తారు. ఆయన కఠినమైన వైఖరి, దూకుడు స్వభావం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీశాయి. అయితే, చాపెల్ కోచింగ్‌లోనే తన కెరీర్ ఉన్నత స్థాయికి చేరిన ఇర్ఫాన్, ఆయన విఫలం కావడానికి గల అసలు కారణాలను విశ్లేషించాడు.

ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఇర్ఫాన్, చాపెల్ తీరు వల్ల జట్టులో అభద్రతా భావం పెరిగిపోయిందని, ఈ విషయాన్ని తాను నేరుగా ఆయనతోనే చర్చించానని గుర్తుచేసుకున్నాడు. "ఆయన సీనియర్లను, జూనియర్లను ఒకేలా చూసేవారు. కానీ, ఎవరైనా సరిగా ఆడకపోతే జట్టు నుంచి తీసేస్తానని ముఖం మీదే చెప్పేవారు. ఇది కాస్త అతిగా అనిపించింది. ఒకసారి నేను ఆయనతో ఈ విష‌య‌మై మాట్లాడాను" అని ఇర్ఫాన్ తెలిపాడు.

"మేం సరిగా ఆడకపోతే మమ్మల్ని తప్పిస్తారని మాకు తెలుసు. ఆ విషయం మీరు పదేపదే చెప్పాల్సిన అవసరం లేదు. ఇది జట్టులో అభద్రతా భావాన్ని కలిగిస్తోంది.. అన్నాను. నా మాటలు విని ఆయన మొదట కాస్త కోపగించుకున్నారు. కొన్ని కఠినమైన మాటలు అన్నారు. కానీ ఆ తర్వాత నేను చెప్పింది నిజమేనని గ్రహించారు" అని పఠాన్ ఆనాటి సంభాషణను వివరించాడు.

చాపెల్ ఉద్దేశం సరైనదే అయినా, భారత జట్టు సంస్కృతిని గౌరవించకపోవడమే ఆయన వైఫల్యానికి ప్రధాన కారణమని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు. "ఆయన ఆస్ట్రేలియా సంస్కృతిని ఇక్కడ రుద్దాలని చూశారు. కఠినమైన క్రికెట్ ఆడాలని కోరుకున్నారు. కానీ, వేరే దేశానికి కోచ్‌గా వెళ్లినప్పుడు అక్కడి సంస్కృతిని కూడా గౌరవించాలి. నేను ఇంగ్లండ్‌లో మిడిల్‌సెక్స్ కౌంటీ క్లబ్‌కు ఆడినప్పుడు, వారి సంస్కృతిలో నేను కూడా భాగమయ్యాను. నేను మద్యం సేవించను, కానీ మ్యాచ్‌కు ముందు వాళ్లంతా బార్‌లో కలిస్తే నేను కూడా వెళ్లేవాడిని. చాపెల్ ఈ ఒక్క చిన్న విషయాన్ని అర్థం చేసుకుని ఉంటే, భారత అత్యుత్తమ కోచ్‌లలో ఒకరిగా నిలిచేవాడు" అని ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషించాడు.     


More Telugu News