బ్రెజిల్ అమ్మాయి... ఇండియా కుర్రాడు.. ఓ 'కరోనా' లవ్ స్టోరీ!

  • బ్రెజిల్ యువతి, భారతీయ యువకుడి ప్రేమ వివాహం
  • కరోనా సమయంలో ఆన్‌లైన్‌లో మొదలైన పరిచయం
  • ఆమెను కలిసేందుకు బ్రెజిల్ వెళ్లిన గుజరాతీ యువకుడు
  • పరిచయమైన కేవలం 5 నెలల్లోనే ఒక్కటైన జంట
  • ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అయిన వారి ప్రేమకథ
  • విభిన్న సంస్కృతులైనా, తమ విలువలు ఒక్కటేనన్న యువతి
ప్రేమకు హద్దులు, దేశాల సరిహద్దులు అడ్డుకావని మరోసారి నిరూపితమైంది. బ్రెజిల్‌కు చెందిన ఓ యువతి, భారత్‌లోని గుజరాత్‌కు చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లాడిన స్ఫూర్తిదాయక కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టైనా షా అనే బ్రెజిల్ అమ్మాయి, భారత యువకుడితో కలిసి సాగించిన ప్రేమ ప్రయాణం, పెళ్లితో రెండు విభిన్న సంస్కృతుల కలయికను వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న పోస్ట్ నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.

వివరాల్లోకి వెళితే, టైనా షా, ఆమె భర్త 2020లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఆన్‌లైన్‌లో తొలిసారిగా ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ సమయంలో వ్యాక్సిన్లు కూడా అందుబాటులో లేనప్పటికీ, ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి జనాలు హడలిపోయిన ఆ రోజుల్లో గుజరాత్ యువకుడు ఆమెను కలుసుకోవడం కోసం బ్రెజిల్‌కు ప్రయాణించడం ఓ సాహసం అనే చెప్పాలి. వైరస్ సోకే అవకాశాలు ఉన్నప్పటికీ ఆ కుర్రాడు ప్రియురాలి కోసం ముందడుగు వేశాడు. ఆ ప్రయాణం వారి ప్రేమ ఎంత గట్టిదో తెలియజేసింది. అలా మొదలైన వారి ప్రేమ ప్రస్థానం కేవలం ఐదు నెలల్లోనే పెళ్లి పీటల వరకు చేరింది. "అలా జరిగిపోవాలని రాసిపెట్టి ఉన్నప్పుడు, ఎక్కువ సమయం పట్టదు కదా!" అంటూ టైనా తన పోస్ట్‌లో సంతోషం వ్యక్తం చేశారు.

వారి వివాహం బ్రెజిల్‌లోనే జరిగింది. తమ పెళ్లికి భారతదేశంలోని అబ్బాయి కుటుంబం మొదటి నుంచి సంపూర్ణ మద్దతు తెలిపిందని, వారి ఆశీస్సులతోనే ఒక్కటయ్యామని ఆమె పేర్కొన్నారు. "మేము వేర్వేరు సంస్కృతుల నుంచి వచ్చినా మా విలువలు ఒక్కటే. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, గౌరవం రోజురోజుకు పెరుగుతోంది. మా ఆత్మలను కలిపిన ఈ విశ్వానికి కృతజ్ఞతలు" అని టైనా తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో వేలాది మంది లైక్‌లు, వందలాది కామెంట్లు వెల్లువెత్తాయి. "ప్రేమ ఎక్కడున్నా ప్రేమే, మీ ఇద్దరికీ అభినందనలు" అంటూ ఒకరు వ్యాఖ్యానించగా, "చాలా అందమైన జంట, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి" అని మరొకరు కామెంట్ చేశారు. రెండు దేశాల సంస్కృతుల్లో కుటుంబ విలువలు, విశ్వాసం, కట్టుబాట్లు వంటి అనేక సారూప్యతలు ఉన్నాయని, ఈ జంట సంతోషంగా ఉండటం ఆనందంగా ఉందని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.


More Telugu News