Chandrababu Naidu: టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై చంద్రబాబు ఫైర్!

Chandrababu Fires on TDP MLA Daggubati Prasad Over Junior NTR Remarks
  • జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వివాదాస్పద వ్యాఖ్యలు
  • తెలుగు యువత నేతతో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్
  • ఎమ్మెల్యే తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
  • గ్రూపు రాజకీయాలు, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే సహించేది లేదని స్పష్టీకరణ
  • మరో ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరుపై కూడా సీఎం అసంతృప్తి
తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలు, అంతర్గత విభేదాలపై ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, వర్గ పోరును ప్రోత్సహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పనితీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. 

వివరాల్లోకి వెళితే, ‘వార్ 2’ సినిమా విడుదల సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, తెలుగు యువత నాయకుడు గుత్తా ధనుంజయ నాయుడుతో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో సంభాషణ ఒకటి బయటకు వచ్చింది. లోకేశ్ గురించి మాట్లాడితే ఎవరినీ వదిలిపెట్టేది లేదని, అనంతపురంలో సినిమా ప్రదర్శనకు వీల్లేదంటూ ఎమ్మెల్యే తీవ్రమైన భాషలో హెచ్చరించినట్లు ఆ ఆడియోలో ఉంది. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ అంశం చంద్రబాబు దృష్టికి వెళ్లినట్టు తాజా పరిణామాల ద్వారా అర్థమవుతోంది. 

అనంతపురంతో పాటు ఆముదాలవలస, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేల తీరుపై కూడా ఆయన అసహనంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నేతల వ్యక్తిగత చర్యల వల్ల పార్టీకి నష్టం వాటిల్లితే, ఆ భారాన్ని పార్టీ ఎందుకు మోయాలని ఆయన సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం. ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.




Chandrababu Naidu
Daggubati Venkateswara Prasad
Junior NTR
TDP
Telugu Desam Party
Anantapur
Andhra Pradesh Politics
War 2 Movie
Gutta Dhanunjaya Naidu
Nara Lokesh

More Telugu News