TTD: తిరుమలలో తోపులాట జరగలేదు.. వదంతులపై టీటీడీ క్లారిటీ

TTD Clarifies No Stampede Incident in Tirumala
  • వైరల్ వీడియోలో తోపులాట లేదు.. భక్తులు ఆందోళన చెందవద్దన్న టీటీడీ
  • వరుస సెలవుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు
  • రాజకీయ ప్రయోజనాల కోసమే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన భక్తుల క్యూలైన్లలో గందరగోళం, తోపులాట జరిగాయంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఇది కేవలం వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నమేనని స్పష్టం చేసింది.

వరుస సెలవులు రావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారని, ఈ అనూహ్య రద్దీని నియంత్రించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న సాధారణ రద్దీని కొందరు గందరగోళంగా చిత్రీకరిస్తున్నారని వారు పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో భక్తుల మధ్య ఎలాంటి తోపులాట జరగలేదని, అది కేవలం సాధారణ రద్దీ మాత్రమేనని టీటీడీ స్పష్టం చేసింది. కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా, భక్తులను ఆందోళనకు గురిచేసేలా దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించింది.

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు సంబంధించిన సున్నితమైన విషయాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం అత్యంత విచారకరమని టీటీడీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి అవాస్తవ ప్రచారాలను భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.
TTD
Tirumala Tirupati Devasthanams
Tirumala
TTD news
Tirumala rush
Tirumala crowd control
Srivari Darshan
Tirumala updates
AP news
Andhra Pradesh

More Telugu News