Foxconn: బెంగళూరు ప్లాంట్ లో ఐఫోన్ 17 ఉత్పత్తి ప్రారంభించిన ఫాక్స్‌కాన్

Foxconn Starts iPhone 17 Production in Bengaluru Plant
  • బెంగళూరులో ఐఫోన్ 17 తయారీ
  • రూ.25,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన కొత్త ప్లాంట్
  • చైనాపై ఆధారపడటం తగ్గించుకునే వ్యూహంలో భాగం
  • అమెరికాలో అమ్ముడవుతున్నవి మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్లేనన్న యాపిల్ సీఈఓ
  • ఈ ఏడాది 6 కోట్ల ఐఫోన్ల తయారీ లక్ష్యం
  • చెన్నై ప్లాంట్‌లోనూ కొనసాగుతున్న ఉత్పత్తి
టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ప్రధాన సరఫరాదారు, తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ ఫాక్స్‌కాన్, బెంగళూరులో కొత్తగా నిర్మించిన ఫ్యాక్టరీలో ఐఫోన్ 17 మోడళ్ల తయారీని ప్రారంభించింది. ఈ పరిణామం భారత్‌ను గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా నిలబెట్టే ప్రయత్నాలకు మరింత ఊతమిస్తోంది.

బెంగళూరు దేవనహళ్లిలో సుమారు రూ. 25,000 కోట్ల (2.8 బిలియన్ డాలర్లు) భారీ పెట్టుబడితో ఫాక్స్‌కాన్ ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. చైనా వెలుపల ఫాక్స్‌కాన్‌కు ఇదే రెండో అతిపెద్ద ఐఫోన్ తయారీ యూనిట్ కావడం విశేషం. ఇప్పటికే చెన్నైలోని ప్లాంట్‌లో ఐఫోన్ 17 తయారీ జరుగుతుండగా, ఇప్పుడు బెంగళూరు యూనిట్ కూడా జత కలిసింది. గతేడాది ఐఫోన్ 16 సిరీస్‌ను కూడా ఇదే తరహాలో గ్లోబల్ లాంచ్‌కు ముందే భారత్‌లో ఉత్పత్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ తాజా పరిణామంపై యాపిల్ గానీ, ఫాక్స్‌కాన్ గానీ అధికారికంగా స్పందించలేదు.

భారత్‌లో ఐఫోన్ల తయారీని యాపిల్ వేగవంతం చేసింది. 2024-25లో 35-40 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేయగా, ఈ ఏడాది దానిని 60 మిలియన్ యూనిట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో (2025 మార్చి 31 నాటికి) భారత్‌లో యాపిల్ సుమారు 22 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను అసెంబుల్ చేసింది.

యాపిల్ గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ ప్రాధాన్యత విపరీతంగా పెరుగుతోందని కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ఇటీవలే స్పష్టం చేశారు. జూన్ లో అమెరికాలో విక్రయించిన మెజారిటీ ఐఫోన్లు భారత్‌లోనే తయారైనవని ఆయన వెల్లడించడం తెలిసిందే. 

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోనూ యాపిల్ తన వాటాను క్రమంగా పెంచుకుంటోంది. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 20 శాతం పెరిగాయి. దీంతో మార్కెట్‌లో యాపిల్ వాటా 7.5 శాతానికి చేరింది. అయినప్పటికీ, భారత మార్కెట్‌లో వివో (19 శాతం వాటా) వంటి చైనా బ్రాండ్‌ల ఆధిపత్యమే కొనసాగుతోంది. ఏదేమైనా, బెంగళూరులో కొత్త ప్లాంట్ ప్రారంభం కావడం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలన్న యాపిల్ వ్యూహంలో ఒక మైలురాయిగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Foxconn
iPhone 17
Apple
Bengaluru
India manufacturing
Tim Cook
iPhone production
Make in India
electronics manufacturing
global supply chain

More Telugu News