Daggubati Prasad: అనంతపురంలో ఉద్రిక్తత... ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బ్యానర్లు చించేసిన ఎన్టీఆర్ అభిమానులు

Jr NTR Fans Protest Against MLA Daggubati Prasad in Anantapur
  • ఆడియో క్లిప్ వివాదం.. ఎమ్మెల్యేపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం
  • అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయం వద్ద నిరసన
  • ఎమ్మెల్యే ఫ్లెక్సీలు చించివేసిన అభిమానులు
  • బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు హెచ్చరిక
అనంతపురం నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లం...కొ... అంటూ జూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయాన్ని ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఆడియో క్లిప్‌లో ఎమ్మెల్యే ఎన్టీఆర్‌ను దూషించారని ఆరోపిస్తూ, అభిమానులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.

నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ముందున్న ఫ్లెక్సీలను చించివేశారు. తమ ఓట్లతో గెలిచి, తమ అభిమాన హీరోనే దూషిస్తావా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తమ మధ్యకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, మూసి ఉన్న గదుల్లో చెప్పే క్షమాపణలు తమకు వద్దని అభిమానులు స్పష్టం చేశారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి, అభిమానులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అభిమానులకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ వివాదాస్పద ఆడియో క్లిప్ నకిలీదని, ఇదొక రాజకీయ కుట్ర అని దగ్గుబాటి వర్గం ఆరోపిస్తోంది. తాను నందమూరి కుటుంబ అభిమానినని, ఎవరైనా బాధపడితే క్షమించాలని గతంలోనే దగ్గుబాటి కోరారని వారు గుర్తు చేస్తున్నారు. అయితే, ఈ వివరణను అభిమానులు తోసిపుచ్చారు. రేపు సాయంత్రంలోగా ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
Daggubati Prasad
Anantapur
Jr NTR
NTR fans protest
MLA Daggubati
Audio clip controversy
Andhra Pradesh politics
Nandamuri family
Political conspiracy
Apology demand

More Telugu News