Congress Party: దేశ విభజన పాపం కాంగ్రెస్‌దే.. ఎన్సీఈఆర్టీ పాఠాలతో కొత్త వివాదం!

NCERT module blames Congress for Partition creates controversy
  • దేశ విభజనపై పాఠశాలల కోసం ఎన్సీఈఆర్టీ ప్రత్యేక మాడ్యూల్
  •  విభజనకు కాంగ్రెస్, జిన్నా, మౌంట్‌బాటెన్‌లే కారణమని వెల్లడి
  •  అధికార మార్పిడిని ముందుకు జరిపి మౌంట్‌బాటెన్ గందరగోళం సృష్టించారని వ్యాఖ్య
  • ఎన్సీఈఆర్టీ వాదనపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ
  • ఆ పత్రాలను తగలబెట్టాలంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా డిమాండ్
  • హిందూ మహాసభ, ముస్లిం లీగ్ వల్లే విభజన జరిగిందని కాంగ్రెస్ ఆరోపణ
స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా దేశ విభజన నాటి గాయాలు, దాని వెనుక ఉన్న కారణాలపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో, దేశ విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీని బాధ్యురాలిని చేస్తూ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) పాఠశాలల కోసం రూపొందించిన ఒక ప్రత్యేక మాడ్యూల్ ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.

"విభజన గాయాల స్మారక దినం" సందర్భంగా ఎన్సీఈఆర్టీ ఈ ప్రత్యేక పాఠ్యాంశాలను విడుదల చేసింది. దేశ విభజన అనేది కేవలం ఒక వ్యక్తి చర్య కాదని, దీని వెనుక మూడు ప్రధాన శక్తులు ఉన్నాయని ఈ మాడ్యూల్‌లో స్పష్టంగా పేర్కొంది. విభజనను ప్రచారం చేసిన మహమ్మద్ అలీ జిన్నా, దానికి అంగీకరించిన కాంగ్రెస్, విభజనను అమలు చేయడానికి వచ్చిన లార్డ్ మౌంట్‌బాటెన్.. ఈ ముగ్గురూ కారణమని తెలిపింది. ఈ విభజన వల్లే కశ్మీర్ దేశానికి కొత్త భద్రతా సమస్యగా మారిందని, పొరుగు దేశం దీన్ని ఆసరాగా చేసుకుని భారత్‌పై ఒత్తిడి తెస్తోందని కూడా వివరించింది.

    ఈ మాడ్యూల్‌లో పలు చారిత్రక అంశాలను ప్రస్తావించారు. హిందువులు, ముస్లింలు రెండు వేర్వేరు జాతులని 1940 లాహోర్ తీర్మానంలో జిన్నా చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. అలాగే, దేశ విభజనను అప్పట్లో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఎందుకు అంగీకరించాల్సి వచ్చిందో కూడా తెలిపారు. "భారత్ ఒక యుద్ధ క్షేత్రంగా మారింది. అంతర్యుద్ధం కంటే దేశాన్ని విభజించడమే మేలు" అని పటేల్ అన్నట్లు పేర్కొన్నారు. గాంధీజీ విభజనను వ్యతిరేకించినప్పటికీ, ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ హింసతో అడ్డుకోలేదని తెలిపారు.

అదే సమయంలో, అధికార మార్పిడి తేదీని జూన్ 1948 నుంచి ఆగస్టు 1947కు మార్చి లార్డ్ మౌంట్‌బాటెన్ తీవ్ర గందరగోళానికి కారణమయ్యారని ఎన్సీఈఆర్టీ తీవ్రంగా విమర్శించింది. ఆగస్టు 15 నాటికి తాము భారత్‌లో ఉన్నామో పాకిస్థాన్‌లో ఉన్నామో కూడా చాలా ప్రాంతాల ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొందని వివరించింది.

ఎన్సీఈఆర్టీ వాదనపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
ఎన్సీఈఆర్టీ మాడ్యూల్‌లోని అంశాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడుతూ "ఈ పత్రంలో నిజాలు లేవు, వెంటనే దాన్ని తగలబెట్టండి. హిందూ మహాసభ, ముస్లిం లీగ్ కుమ్మక్కు కావడం వల్లే దేశ విభజన జరిగింది" అని ఆరోపించారు. 1938లో హిందూ మహాసభే తొలిసారి విభజన ఆలోచనను ముందుకు తెచ్చిందని, 1940లో జిన్నా దాన్ని పునరుద్ఘాటించారని ఆయన అన్నారు. ఈ వివాదంతో, దేశ విభజన చరిత్రను పాఠశాలల్లో ఎలా బోధించాలనే దానిపై మరోసారి రాజకీయ పోరు మొదలైంది.
Congress Party
Partition of India
NCERT
India Pakistan Partition
Lord Mountbatten
Jinnah
Pawan Khera
Sardar Vallabhbhai Patel
History of India
Hindu Mahasabha

More Telugu News