Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో 13 మంది పాక్ సైనికుల హతం.. మూడు నెలల తర్వాత ఒప్పుకున్న పాకిస్థాన్

Operation Sindoor Pakistan Admits 13 Soldiers Killed After 3 Months
  • 'ఆపరేషన్ సిందూర్' దాడులపై మౌనం వీడిన  పాక్ 
  • వైమానిక దాడుల్లో భారీ నష్టం వాటిల్లినట్టు పరోక్ష అంగీకారం
  • చనిపోయిన సైనికులకు మరణానంతర శౌర్య పతకాలు ప్రదానం
  • పాక్ ఎయిర్‌బేస్‌లపై దాడుల్లో అమెరికన్ టెక్నీషియన్లకు కూడా గాయాలు 
భారత వాయుసేన జరిపిన 'ఆపరేషన్ సిందూర్' మెరుపు దాడుల్లో తమకు భారీ నష్టం వాటిల్లిన విషయాన్ని పాకిస్థాన్ ఎట్టకేలకు పరోక్షంగా అంగీకరించింది. ఈ సైనిక చర్యలో 13 మంది సైనిక సిబ్బంది సహా 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు ఘటన జరిగిన మూడు నెలల తర్వాత అంగీకరించింది. తమ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరణించిన సైనికులకు మరణానంతరం శౌర్య పతకాలను ప్రదానం చేసి, ఈ నిజాన్ని ప్రపంచం ముందు ఒప్పుకుంది.

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన సంగతి తెలిసిందే. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (టీఆర్ఎఫ్) ఈ దాడికి బాధ్యత వహించింది. దీనికి ప్రతీకారంగా మే 7వ తేదీ తెల్లవారుజామున భారత వాయుసేన 'ఆపరేషన్ సిందూర్' పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు జరిపింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు భారత ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది.

అయితే, ఈ దాడులపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న పాకిస్థాన్, ఆగస్టు 14న తమ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అసలు నిజాన్ని బయటపెట్టింది. అధ్యక్ష భవనంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేతుల మీదుగా 'ఆపరేషన్ సిందూర్' సమయంలో మరణించిన సైనిక సిబ్బందికి మరణానంతరం పురస్కారాలు అందజేశారు. ఈ దాడుల్లో భోలారీ ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడిలో మరణించిన స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్‌కు 'తమ్ఘా-ఇ-బసాలత్' పురస్కారాన్ని ప్రకటించారు. ఆయనతో పాటు హవల్దార్ ముహమ్మద్ నవీద్, నాయక్ వకార్ ఖాలిద్, లాన్స్ నాయక్ దిలావర్ ఖాన్‌లకు కూడా మరణానంతరం ఈ పురస్కారాన్ని ఇచ్చారు.

భారత దాడులు జరిగిన నూర్ ఖాన్, సర్దోఘా, జాకోబాబాద్, భోలారీ, షోర్‌కోట్ వైమానిక స్థావరాల్లో పలువురు గాయపడినట్లు కూడా సమాచారం. ముఖ్యంగా నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో జరిగిన దాడిలో కొందరు అమెరికన్ టెక్నీషియన్లు సైతం గాయపడినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ అవార్డుల ప్రదానంతో భారత వైమానిక దాడుల తీవ్రతను, దానివల్ల తమకు జరిగిన నష్టాన్ని పాకిస్థాన్ పరోక్షంగా అంగీకరించినట్టు అయింది.
Operation Sindoor
Indian Air Force
Pakistan
Pak Occupied Kashmir
Surgical Strike
Terrorist Camps
Shehbaz Sharif
Noor Khan Airbase

More Telugu News