Chiranjeevi: 'స్టాలిన్' చిత్రం రీ-రిలీజ్ పై చిరంజీవి ఏమన్నారంటే...!

Chiranjeevi Comments on Stalin Movie Re Release
  • చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'స్టాలిన్' రీ-రిలీజ్
  • ఆగస్టు 22న థియేటర్లలోకి రానున్న మెగా మూవీ
  • సమాజానికి గొప్ప సందేశమిచ్చిన చిత్రమన్న చిరంజీవి
  • ఈ తరం ప్రేక్షకులకు ఈ సినిమా మంచి అనుభూతినిస్తుందని వెల్లడి
  • సినిమా యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘స్టాలిన్’ మళ్లీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి, ‘స్టాలిన్’ సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందించిన చిత్రమని గుర్తుచేసుకున్నారు. రెండు దశాబ్దాల క్రితం విడుదలైనా, ఆ చిత్రంలోని సందేశం ఇప్పటికీ ఎంతో విలువైనదని ఆయన అన్నారు.

ఈ చిత్రం గురించి చిరంజీవి మాట్లాడుతూ, "ఒక వీర సైనికుడిగా దేశ సరిహద్దుల్లో శత్రువులతో పోరాడటమే కాకుండా, సమాజంలోని లోపాలతోనూ పోరాడాలని హీరో స్టాలిన్‌ చాటిచెబుతాడు. ఒక సామాజిక స్పృహ కలిగిన పౌరుడిగా మారి, మంచి పనుల ద్వారా సమాజంలో మార్పు తెస్తాడు. ఒక మంచి పనికి కృతజ్ఞతలు చెప్పడం కంటే, ఆ స్ఫూర్తితో మరో ముగ్గురికి సాయం చేయాలనే సూత్రం ఈ సినిమాకు ఆయువుపట్టు" అని వివరించారు. ఈ కాన్సెప్ట్ ఈ తరం ప్రేక్షకులకు కూడా వినోదంతో పాటు ఒక సామాజిక బాధ్యతను గుర్తు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

2006లో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాగబాబు నిర్మించారు. ఇందులో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటించగా, ఖుష్బూ, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విజయానికి కారణమైన దర్శకుడు మురుగదాస్, నిర్మాత నాగబాబు, సంగీత దర్శకుడు మణిశర్మ, కెమెరామెన్ చోటా కె నాయుడులతో పాటు నటీనటులందరికీ చిరంజీవి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
Chiranjeevi
Stalin movie
Stalin re release
AR Murugadoss
Trisha
Nagababu
Telugu movies
Chiranjeevi birthday
Social message movies
Manisharma

More Telugu News