Wang Yi: వచ్చే వారం భారత పర్యటనకు రానున్న చైనా విదేశాంగ మంత్రి

Wang Yi to Visit India Next Week for Border Talks
  • సరిహద్దు సమస్యపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో చర్చలు
  • విదేశాంగ మంత్రి జైశంకర్‌తోనూ ద్వైపాక్షిక సమావేశం
  • గల్వాన్ ఘర్షణల తర్వాత సంబంధాల పునరుద్ధరణకు ఇరుదేశాల ప్రయత్నాలు
  • ఈ నెలాఖరులో చైనాలో జరగనున్న ఎస్‌సీఓ సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యే సూచనలు
భారత్-చైనా మధ్య సరిహద్దు వివాద పరిష్కార దిశగా మరో కీలక ముందడుగు పడింది. చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ వచ్చే వారం భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఆయన పర్యటన ఉంటుందని, ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ప్రత్యేక ప్రతినిధుల (ఎస్‌ఆర్) స్థాయిలో 24వ విడత చర్చలు జరుగుతాయని భారత విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ పర్యటనలో భాగంగా వాంగ్ యీ, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమై సరిహద్దు సమస్యపై ప్రధానంగా చర్చిస్తారు. అనంతరం, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో కూడా ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. 2020 జూన్‌లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉన్నతస్థాయి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో తూర్పు లడఖ్‌లోని డెమ్చోక్, డెప్సాంగ్ ప్రాంతాల నుంచి సైనికుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో ఉద్రిక్తతలు సద్దుమణిగాయి. సంబంధాల పునరుద్ధరణలో భాగంగా గత డిసెంబరులో అజిత్ దోవల్ చైనాలో పర్యటించి వాంగ్ యీతో చర్చలు జరిపారు. ఆ తర్వాత భారత్ చైనా పౌరులకు పర్యాటక వీసాలను కూడా తిరిగి ప్రారంభించింది.

ఈ పరిణామాల మధ్య, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెలాఖరులో చైనాలో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనాలోని టియాంజిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సుకు ఆయన హాజరుకావొచ్చని తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ పర్యటన ఖరారైతే, 2018 తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి అవుతుంది.
Wang Yi
China foreign minister
India China border
Ajit Doval
S Jaishankar
India China relations
SCO summit
Galwan valley clash
border dispute
India China talks

More Telugu News