Varudu Kalyani: ఉచిత ప్రయాణం పేరుతో మహిళలను దారుణంగా మోసం చేశారు: వరుదు కల్యాణి

Varudu Kalyani Criticizes Free Bus Scheme for Women in AP
  • 16 రకాల బస్సుల్లో కేవలం 5 రకాల బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం అని కల్యాణి మండిపాటు 
  • తిరుపతి, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాలకు పథకం వర్తించదని వెల్లడి
  • మీ మేనత్తలకు చంద్రబాబు ఎప్పుడైనా రాఖీ కట్టారా అని లోకేశ్‌కు సూటి ప్రశ్న
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ పథకం పేరుతో కూటమి ప్రభుత్వం మహిళలను దారుణంగా మోసం చేసిందని, వారి ఆశలను బస్సు టైర్ల కింద తొక్కేసిందని ఆరోపించారు. మంత్రి నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఆమె ఘాటుగా స్పందించారు.

దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌ కలిసి మహిళలను వంచించారని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో ఏపీఎస్‌ఆర్టీసీకి 16 రకాల బస్సులు ఉంటే కేవలం 5 రకాల బస్సుల్లో, అదీ కొన్ని ప్రాంతాలకే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేశారని విమర్శించారు. ఎన్నికల ముందు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు శ్రావణ శుక్రవారం రోజున మహిళలను చీటింగ్ చేశారని అన్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం, అన్నవరం వంటి పుణ్యక్షేత్రాలకు ఈ పథకం వర్తించకపోవడంతో రెండున్నర కోట్ల మంది మహిళలను మోసం చేసినట్లేనని ఆమె పేర్కొన్నారు. లగేజీతో మహిళలు పది, పదిహేను బస్సులు మారుతూ తిరుపతి వెళ్లడం సాధ్యమేనా అని ఆమె ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి అంటే 'చీటింగ్ మాస్టర్'గా మారిందని, కూటమి ప్రభుత్వం 'కోతల ప్రభుత్వం'గా తయారైందని వరుదు కల్యాణి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.

అంతకుముందు లోకేశ్‌ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపైనా కల్యాణి తీవ్రంగా స్పందించారు. మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత లోకేశ్‌కు ఉందా అని నిలదీశారు. "మీ మేనత్తలు ఎప్పుడైనా మీ నాన్నకు రాఖీ కట్టారా? మీ ఇంటి శుభకార్యాలకు వారిని పిలిచారా? హెరిటేజ్‌లో వారికి ఎంత వాటా ఇచ్చారు?" అని వరుస ప్రశ్నలు సంధించారు. పది కోట్లు ఖర్చు పెట్టి పవన్‌ కల్యాణ్‌ తల్లిని లోకేశ్‌ తిట్టించలేదా అని కూడా ఆమె ఆరోపించారు. చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌ తమ ప్రత్యేక విమానాల ఖర్చులు తగ్గించుకుంటే రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించవచ్చని వరుదు కల్యాణి సూచించారు.
Varudu Kalyani
APSRTC free bus travel
Andhra Pradesh women
Nara Lokesh
YS Jagan Mohan Reddy
TDP government
AP elections 2024
free travel scheme
women cheating
coalition government

More Telugu News