Donald Trump: భారత్‌పై సుంకాలతో... ఉక్రెయిన్ పై దాడి చేయకుండా పుతిన్‌ను ఆపలేరు: ట్రంప్‌ నిర్ణయంపై డెమోక్రాటిక్ ప్యానల్ విమర్శ

Donald Trump Tariffs on India Cant Stop Putin From Ukraine Attack says House Foreign Affairs Committee
  • భారత్ పై సుంకాలు విధించినంత మాత్రాన పుతిన్ ఆగరన్న డెమొక్రాటిక్ ప్యానల్
  • ఉక్రెయిన్ కు సైనిక సాయం అందించడమే మార్గమని సూచన
  • రష్యా దురాక్రమణను అడ్డుకోవాలంటే పుతిన్ శిక్షించాలన్న ప్యానల్
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న విషయంలో అమెరికాలో రాజకీయ వేడి రాజుకుంది. భారత్‌పై 50 శాతం మేర భారీ సుంకాలు (టారిఫ్‌లు) విధించాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని... డెమొక్రాటిక్ పార్టీ విదేశీ వ్యవహారాల కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇలాంటి చర్యల వల్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను నిలువరించలేమని, ఉక్రెయిన్ పై పుతిన్ పై దాడిని ఆపలేమని స్పష్టం చేసింది.

"భారత్‌పై సుంకాలు విధించడం వల్ల పుతిన్ ఆగిపోరు. ట్రంప్ నిజంగా రష్యా దురాక్రమణను అడ్డుకోవాలని అనుకుంటే పుతిన్‌ను శిక్షించాలి. ఉక్రెయిన్‌కు అవసరమైన సైనిక సహాయాన్ని అందించాలి. మిగతావన్నీ కేవలం కంటితుడుపు చర్యలే అవుతాయి" అని హౌస్ ఫారెన్ అఫైర్స్ కమిటీకి చెందిన డెమోక్రాటిక్ ప్యానెల్ ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఈ వ్యాఖ్యలు వెలువడటానికి ముందు, అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ భారత్‌కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తే ద్వితీయ శ్రేణి సుంకాలను మరింత పెంచే అవకాశం ఉందని ఆయన బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అలాస్కాలో ట్రంప్, పుతిన్‌ల మధ్య ముగిసిన చర్చలు ఫలించకపోతే తదుపరి చర్యలు తీవ్రంగా ఉండొచ్చని ఆయన అన్నారు.

"రష్యా చమురు కొంటున్నందుకు భారతీయులపై మేం ఇప్పటికే ద్వితీయ శ్రేణి సుంకాలను విధించాం. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే, ఈ ఆంక్షలు లేదా సుంకాలను మరింత పెంచే అవకాశాలు ఉన్నాయి" అని బెస్సెంట్ వివరించారు.

రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్నది చైనా కదా అని ప్రశ్నించగా... "అధ్యక్షుడు ట్రంప్ తనకు అనుకూలంగా పరిస్థితులను మార్చుకోవడంలో దిట్ట. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను పుతిన్ ముందు ట్రంప్ ఉంచారు" అని బెస్సెంట్ పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో డెమొక్రాటిక్ ప్యానల్ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Donald Trump
India Russia oil imports
Ukraine war
Vladimir Putin
US tariffs on India
Scott Bessent
House Foreign Affairs Committee
Russia Ukraine conflict
US sanctions on Russia

More Telugu News