KCR: కాళేశ్వరంపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో బీఆర్ఎస్.. ముఖ్య నేతలతో కేసీఆర్ కీలక భేటీ

KCR meets with BRS Leaders on Kaleshwaram Project Allegations
  • హరీశ్ రావు, వినోద్ కుమార్ తదితర నేతలతో కేసీఆర్ సమాలోచనలు
  • ప్రాజెక్టుపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టే అంశంపై చర్చ
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించిన కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై కమిషన్ నివేదికను సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలో ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు, పలువురు ఉన్నతాధికారులపై కమిషన్ తీవ్ర ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. వీటిని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. 

ఈ అంశానికి సంబంధించి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో హరీశ్ రావు, బోయినపల్లి వినోద్ కుమార్ తదితర ముఖ్య నేతలతో నిన్న సమావేశమయ్యారు. ప్రాజెక్టుపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టడం, నిలిచిపోయిన ప్రాజెక్టును తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేలా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అంశంపై కేసీఆర్ చర్చించినట్టు సమాచారం. 

బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందంటూ నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలపై కూడా కేసీఆర్ ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం నివేదిక, అసెంబ్లీ సమావేశాలు, ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం, దానిని అధిగమించేందుకు ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే దానిపై కూడా కేసీఆర్ చర్చించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే దానిపై కూడా సమాలోచనలు జరిపినట్టు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశాన్ని కేటీఆర్ చూసుకుంటారని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది.
KCR
Kaleshwaram project
Telangana
Harish Rao
Revanth Reddy
BRS party
Supreme Court
irrigation project
Telangana politics

More Telugu News