నా నియోజ‌క‌వ‌ర్గంలో మీరు టికెట్ కొన‌డ‌మేంట‌న్నా.. ప‌వ‌న్‌తో లోకేశ్ స‌ర‌దా వ్యాఖ్య‌

  • నిన్న ఏపీలో అమ‌ల్లోకి వ‌చ్చిన‌ మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కం 'స్త్రీ శక్తి' 
  • విజయవాడలో ఈ పథకాన్ని లాంచనంగా ప్రారంభించిన సీఎం చంద్ర‌బాబు
  • ఈ సంద‌ర్భంగా ఆర్‌టీసీ బస్సులో ప్రయాణించి సీఎం, డిప్యూటీ సీఎం, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు  
  • ఈ క్ర‌మంలో డిప్యూటీ సీఎం పప‌న్‌, మంత్రి లోకేశ్ మ‌ధ్య స‌ర‌దా స‌న్నివేశం
స్వాతంత్ర్య దినోత్స‌వం కానుక‌గా నిన్న ఏపీలో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కం 'స్త్రీ శక్తి' అమల్లోకి వచ్చింది. విజయవాడలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని లాంచనంగా ప్రారంభించారు. చంద్ర‌బాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు మాధ‌వ్‌ మహిళలతో కలిసి ఉండ‌వ‌ల్లి నుంచి విజ‌య‌వాడ బ‌స్టాండ్ వ‌ర‌కు ఆర్‌టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సంద‌ర్భంగా స‌ర‌దా స‌న్నివేశం చోటుచేసుకుంది. మొద‌ట సీఎం చంద్ర‌బాబు మ‌హిళా కండ‌క్ట‌ర్ వ‌ద్ద టికెట్ తీసుకున్నారు. ఇది తెలిసి మంత్రి లోకేశ్ ఆ డ‌బ్బులు వెన‌క్కి ఇప్పించారు. 

ఆ త‌ర్వాత ప‌వ‌న్ బ‌స్సులో ఎక్కి టికెట్ కోసం కండ‌క్ట‌ర్‌కు డ‌బ్బులు చెల్లిస్తుండ‌గా... ఆగ‌న్నా అని లోకేశ్ అడ్డుకున్నారు. నా నియోజ‌క‌వ‌ర్గం(మంగ‌ళ‌గిరి)లో మీరు డ‌బ్బులు చెల్లించ‌డం ఏంట‌న్నా అని అన్నారు. అనంత‌రం త‌న టికెట్ డ‌బ్బుల‌తో పాటు సీఎం, డిప్యూటీ సీఎం, మాధ‌వ్ టికెట్‌ల డ‌బ్బుల‌ను కూడా లోకేశ్ చెల్లించారు. ఇప్పుడు ఛార్జీల‌కు నేను ఖ‌ర్చు చేసినందున‌.. మా నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌భుత్వం నుంచి ఎక్కువ నిధులు తీసుకుంటాన‌ని మంత్రి లోకేశ్ స‌ర‌దాగా చెప్ప‌డంతో బ‌స్సులోని వారంద‌రూ న‌వ్వుకున్నారు. 


More Telugu News