Farooq Abdullah: క్లౌడ్ బరస్ట్... శిథిలాల కింద 500 నుంచి 1000 మంది ఉండవచ్చు: ఫరూక్ అబ్దుల్లా

Farooq Abdullah on Kishtwar Cloudburst Tragedy
  • ఇది అత్యంత బాధాకరమైన సమయమని ఫరూక్ అబ్దుల్లా విచారం
  • జమ్ముకశ్మీర్‌లోని కిశ్త్వార్ జిల్లాలో కుంభవృష్టి
  • చశోతి గ్రామంపై విరుచుకుపడిన భారీ వర్షం
  • 60 మంది మరణించినట్టు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటన
జమ్ము కశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ విలయం సృష్టించిన విషయం తెలిసిందే. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటనపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా స్పందించారు.

"శిథిలాల కింద 500 మందికి పైగా చిక్కుకొని ఉండవచ్చు. కొందరు అధికారులు ఈ సంఖ్య వెయ్యి దాటవచ్చని చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది అత్యంత బాధాకరమైన సమయం" అని ఆయన విచారం వ్యక్తం చేశారు.

శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా శ్రీనగర్‌లో ప్రసంగించిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, తన ప్రసంగాన్ని కిష్ట్వార్ మృతులకు సంతాపం తెలుపుతూ ప్రారంభించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

గురువారం మధ్యాహ్నం చశోతి గ్రామంలో కుంభవృష్టి కారణంగా కనీసం 60 మంది మరణించారని, మరో 100 మందికి పైగా గాయపడ్డారని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఈ ప్రకృతి విపత్తు కారణంగా గ్రామం తీవ్రంగా నష్టపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కిష్ట్వార్ పరిస్థితిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారని, సహాయక చర్యల గురించి ఆయనకు వివరించినట్లు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు.

అయితే, ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. "వాతావరణ శాఖ నుంచి ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ ఈ ప్రాణనష్టాన్ని ఎందుకు ఆపలేకపోయామనే దానిపై మనం జవాబుదారీగా ఉండాలి. విలువైన ప్రాణాలను కాపాడటంలో ప్రభుత్వం, పరిపాలనా యంత్రాంగం వైఫల్యం చెందిందా అనే కోణంలో ఆత్మపరిశీలన చేసుకోవాలి" అని ఆయన అన్నారు.
Farooq Abdullah
Kishtwar cloudburst
Jammu Kashmir floods
Omar Abdullah
cloudburst disaster

More Telugu News