Asaduddin Owaisi: 'హిందుస్థాన్ హమారా హై'.. హైదరాబాద్‌లో ఒవైసీ సోదరుల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Asaduddin Owaisi Celebrates Independence Day in Hyderabad
  • హైదరాబాద్‌లో ఘనంగా ఎంఐఎం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
  • మదీనా సర్కిల్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎంపీ అసదుద్దీన్
  • బాలికల మదరసాలో జెండా ఎగరేసిన అసద్.. దేశభక్తి నినాదాలు
  • బండ్లగూడలో జెండా వందనం చేసిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్
  • దారుస్సలాంలోనూ ఘనంగా వేడుకలు.. పాల్గొన్న నేతలు, కార్యకర్తలు
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు, శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ హైదరాబాద్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు.

ఈ వేడుకల్లో భాగంగా మొఘల్‌పురాలోని ‘జామియతుల్ మోమినాత్’ బాలికల మదరసాలో అసదుద్దీన్ ఓవైసీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బురఖాలు ధరించిన విద్యార్థినులు జాతీయ గీతాన్ని ఆలపించడంతో పాటు ‘సారే జహా సే అచ్ఛా’ గీతాన్ని శ్రావ్యంగా పాడారు. అసదుద్దీన్ రాక సందర్భంగా చేతుల్లో త్రివర్ణ పతాకాలు పట్టుకుని ‘హిందుస్థాన్ హమారా హై’ అంటూ వారు చేసిన నినాదాలు ఆ ప్రాంతంలో దేశభక్తి వాతావరణాన్ని నింపాయి. ఈ సందర్భంగా మదరసా యాజమాన్యం ఎంపీకి ఘన స్వాగతం పలికి సత్కరించింది.

అంతకుముందు, చారిత్రక చార్మినార్ సమీపంలోని ప్రసిద్ధ మదీనా సర్కిల్‌లో కూడా అసదుద్దీన్ ఓవైసీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం స్థానిక నేతలు, కార్యకర్తలు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరోవైపు, అక్బరుద్దీన్ ఓవైసీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడలో ఉన్న బారిస్టర్ ఫాతిమా ఒవైసీ కేజీ టూ పీజీ క్యాంపస్‌లో జెండా వందనం చేశారు. ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇక ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో పార్టీ సంయుక్త కార్యదర్శి ఎస్‌ఏ హుస్సేన్ అన్వర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలు, నాయకులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ 'ఎక్స్' వేదికగా దేశ ప్రజలకు "యౌమ్ ఏ ఆజాదీ ముబారక్" అంటూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ ఉర్దూ కవి చక్‌బస్త్ రాసిన "ఏ ఖాక్-ఏ-హింద్ తేరీ అజ్మత్ మే క్యా గుమాన్ హై" అనే కవితలోని కొన్ని పంక్తులను కూడా ఆయన తన పోస్టులో పంచుకున్నారు.
Asaduddin Owaisi
Hyderabad
Independence Day
AIMIM
Akbaruddin Owaisi
Charminar

More Telugu News