Chandrababu: సంక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు: సీఎం చంద్రబాబు

Chandrababu Announces Welfare and Development Initiatives on Independence Day
  • 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణ చేసిన సీఎం
  • ఆడబిడ్డలకు కానుకగా ఆర్టీసీ బస్సుల్లో ‘స్త్రీ శక్తి’ ఉచిత ప్రయాణం ప్రారంభం
  • ఏడాది పాలనలో ‘సూపర్ సిక్స్’ హామీలను సూపర్ హిట్ చేశామన్న చంద్రబాబు
  • కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు తిరుగులేదని స్పష్టం
  • 2027 డిసెంబర్‌కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటన
  • రాష్ట్ర పునర్నిర్మాణమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్తున్నామని వెల్లడి
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు కీలక కానుకను ప్రకటించారు. ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ, మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ చారిత్రాత్మక రోజున తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో సాధించిన ప్రగతిని ప్రజల ముందు ఉంచారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. "ప్రజలు గెలవాలి- రాష్ట్రం నిలవాలి అనే నినాదంతో 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. వారి నమ్మకాన్ని నిలబెడుతూ, రాష్ట్రాన్ని పునర్నిర్మించడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నాం. మా ఏడాది పాలనలో సంక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు, సుపరిపాలనకు పోటీ లేదు. ఇది ఒక రికార్డ్, ఆల్ టైం రికార్డ్" అని సగర్వంగా ప్రకటించారు.

ప్రధాన ఎన్నికల హామీలైన ‘సూపర్ సిక్స్’ను సూపర్ హిట్ చేశామని చంద్రబాబు తెలిపారు. ‘తల్లికి వందనం’ పథకం కింద కోట్లాది తల్లులకు ఆర్థిక భరోసా కల్పించామని, ‘ఎన్టీఆర్ భరోసా’ ద్వారా 64 లక్షల మందికి ఇంటి వద్దకే పింఛన్లు అందిస్తున్నామని వివరించారు. ‘అన్నదాత సుఖీభవ’ కింద 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,173 కోట్లు జమ చేశామని, ‘దీపం’ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు.

2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు వృథాగా సముద్రంలోకి పోతున్న గోదావరి వరద నీటిని బనకచర్లకు తరలిస్తామని, దీనివల్ల ఏ రాష్ట్రానికీ నష్టం వాటిల్లదని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా తరలివస్తున్నాయని, రూ.5.94 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామని, దీని ద్వారా 5.56 లక్షల ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు.

యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని పూర్తి చేస్తున్నామని, భూ యజమానులకు భద్రత కల్పిస్తూ ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌’ను రద్దు చేశామని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని, అందులో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
Chandrababu
AP CM
Andhra Pradesh
79th Independence Day
Stree Shakti Scheme
Free Bus Travel
Polavaram Project
Super Six Promises
Mega DSC
AP Economy

More Telugu News