Chandrababu Naidu: నేటి నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. 'స్త్రీ శక్తి'కి శ్రీకారం

AP Sthree Shakthi scheme starts free bus travel for women
  • విజయవాడలో లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
  • పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సహా 8,458 బస్సుల్లో వర్తించనున్న పథకం
  • ప్రభుత్వంపై ఏటా రూ.1,942 కోట్ల అదనపు భారం
  • గుర్తింపు కార్డు చూపి జీరో టికెట్‌తో ప్రయాణించే వెసులుబాటు
  • పథకం అమలుపై ఆర్టీసీ ఎండీ ఉన్నతస్థాయి సమీక్ష
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తన ఎన్నికల హామీల అమలులో మరో కీలక ముందడుగు వేసింది. సూపర్ సిక్స్ పథకాలలో అత్యంత ప్రాధాన్యమున్న ‘స్త్రీ శక్తి’ పథకానికి నేడు శ్రీకారం చుట్టనుంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, యువతులు, థర్డ్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు విజయవాడలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో రాష్ట్రంలోని సుమారు 2.62 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది.

'స్త్రీ శక్తి' పథకం అమలు వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.1,942 కోట్ల ఆర్థిక భారం పడుతుందని అంచనా. ఈ పథకం ద్వారా ప్రతి మహిళ నెలకు సగటున రూ.1,000 నుంచి రూ.3,000 వరకు ఆదా చేసుకోగలరని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్టీసీకి చెందిన మొత్తం బస్సుల్లో 74 శాతం అంటే 8,458 బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే, నాన్‌స్టాప్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులతో పాటు ఘాట్ రోడ్లలో తిరిగే సర్వీసులకు ఈ పథకం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.

ప్రయాణ సమయంలో మహిళలు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఓటర్ ఐడీ కార్డులలో ఏదో ఒకటి కండక్టర్‌కు చూపించి ‘జీరో ఫేర్ టికెట్’ పొందాల్సి ఉంటుంది. ఈ పథకం అమలుకు ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. డ్రైవర్ల కొరతను అధిగమించేందుకు ‘ఆన్‌కాల్’ డ్రైవర్లను నియమించుకుంది. భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సైతం సమకూర్చుకోనున్నట్టు అధికారులు తెలిపారు.

ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు నిన్న అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళా ప్రయాణికులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, ఎలాంటి ఫిర్యాదులకు తావివ్వకుండా పథకాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, అన్నదాత సుఖీభవ, మెగా డీఎస్సీ వంటి హామీలను అమలు చేసిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ‘స్త్రీ శక్తి’తో మహిళల మన్ననలు పొందేందుకు సిద్ధమైంది.
Chandrababu Naidu
AP free bus travel
Sthree Shakthi scheme
Andhra Pradesh RTC
AP government schemes
Free bus travel for women
AP women welfare
AP new government
AP election promises
Dwaraka Tirumala Rao

More Telugu News