IIT Hyderabad: హైదరాబాద్ ఐఐటీలో డ్రైవర్‌లెస్ బస్సులు.. దేశంలోనే తొలి ప్రయోగం!

IIT Hyderabad Launches Driverless Buses First in India
  • పూర్తిగా విద్యుత్‌తో నడిచే మినీ బస్సులు
  • ఆరు, పద్నాలుగు సీట్ల సామర్థ్యంతో రెండు వేరియంట్లు
  • టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఐఐటీ పరిశోధన విభాగం 'టీహన్'  
  • ప్రయాణికుల నుంచి 90 శాతం సానుకూల స్పందన
డ్రైవర్ అవసరం లేకుండా వాతంతట అవే నడిచే బస్సులు ఇక కల కాదు. హైదరాబాద్‌లో ఇది వాస్తవరూపం దాల్చింది. నగరంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) క్యాంపస్‌లో డ్రైవర్‌లెస్ మినీ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఒక విద్యాసంస్థ ప్రాంగణంలో పూర్తిస్థాయిలో డ్రైవర్‌రహిత బస్సులను వినియోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన 'టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ (టీహన్)' అనే ప్రత్యేక పరిశోధన విభాగం ఈ సాంకేతికతను పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఆరు సీట్లు, పద్నాలుగు సీట్ల సామర్థ్యంతో రెండు రకాల విద్యుత్ బస్సులను క్యాంపస్‌లో నడుపుతున్నారు. గత మూడు రోజులుగా విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది వర్సిటీ మెయిన్ గేటు నుంచి ఇతర విభాగాలకు వెళ్లేందుకు ఈ బస్సులనే వినియోగిస్తున్నారు.

ఈ వాహనాల్లో ప్రయాణ భద్రతకు పెద్దపీట వేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో పనిచేసే ఈ బస్సులు, ప్రయాణ మార్గంలో ఏవైనా అడ్డంకులు ఎదురైతే వెంటనే గుర్తించి సురక్షితమైన దారిలో పయనిస్తాయి. వేగాన్ని నియంత్రించేందుకు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన వ్యవస్థలను అమర్చారు.

ఈ బస్సుల్లో ప్రయాణించిన వారి నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని టీహన్ ప్రతినిధులు తెలిపారు. సుమారు 90 శాతం మంది ప్రయాణికులు ఈ నూతన విధానంపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం క్యాంపస్ పరిధిలో నడుస్తున్న ఈ బస్సులు, భవిష్యత్తులో ప్రజా రవాణాలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
IIT Hyderabad
driverless bus
autonomous vehicle
AI technology
electric bus
Tihan IIT Hyderabad
autonomous navigation
Hyderabad
technology innovation hub
public transportation

More Telugu News