: వచ్చే ఎన్నికల్లో జగన్ ను కూడా ఓడిస్తాం: పులివెందులలో గెలుపు తర్వాత లతారెడ్డి

  • పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం
  • డిపాజిట్ కోల్పోయిన వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి
  • పులివెందులలో న్యాయం, ధర్మం గెలిచాయన్న లతారెడ్డి
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై 6,050 ఓట్ల తేడాతో తిరుగులేని విజయం సాధించారు. ఈ ఎన్నికలో వైసీపీ డిపాజిట్ కోల్పోయింది. ఈ గెలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. 

అద్భుత విజయం సాధించిన తర్వాత లతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... పులివెందులలో న్యాయం, ధర్మం గెలిచాయని అన్నారు. తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ ను కూడా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

మంత్రి సవిత మాట్లాడుతూ... పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పారు. పులివెందుల అభివృద్ధి కోసమే ప్రజలు టీడీపీకి ఓటు వేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల కోటను బద్దలు కొడతామని చెప్పారు. 

మరో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నమ్మకంతోనే టీడీపీకి పులివెందుల ప్రజలు విజయాన్ని కట్టబెట్టారని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News