Suleman Khan: అమ్మాయితో మాట్లాడుతున్నాడని ముస్లిం యువకుడిని కొట్టి చంపేశారు!

Jalgaon Crime Muslim Youth Suleman Khan Murder Case
  • మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఘటన
  • కేఫ్‌లో యువతితో మాట్లాడుతుండగా లాక్కెళ్లిన నిందితులు
  • గ్రామానికి తీసుకెళ్లి కర్రలు, ఇనుప రాడ్లతో దాడి
  • అడ్డుకోవడానికి ప్రయత్నించిన కుటుంబ సభ్యులపైనా దాడి
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మరో మతానికి చెందిన యువతితో మాట్లాడినందుకు 21 ఏళ్ల ముస్లిం యువకుడిని పది మంది వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు. పాత కక్షల కారణంగానే అతనిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సూత్రధారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. బేతవాడ్ ఖుర్ద్ గ్రామానికి చెందిన సులేమాన్ ఖాన్ సోమవారం పోలీసు రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫామ్ నింపడానికి జామ్నర్‌కు వెళ్లాడు. అక్కడ ఒక కేఫ్‌లో ఒక యువతితో మాట్లాడుతుండగా పది మంది వ్యక్తులు అతడితో గొడవపడి, కొట్టడం మొదలుపెట్టారు. అనంతరం వారు సులేమాన్‌ను అతడి గ్రామానికి బలవంతంగా తీసుకెళ్లి బస్టాండ్ వద్ద కర్రలు, ఇనుప రాడ్లతో తీవ్రంగా కొట్టారు.

సులేమాన్ కుటుంబ సభ్యులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిపైనా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సులేమాన్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన జామ్నర్‌లో ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఖాన్ బంధువులు, స్థానికులు జామ్నర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కిడ్నాప్, అల్లర్లు, హత్య వంటి నేరాల కింద భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని వివిధ సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Suleman Khan
Jalgaon
Maharashtra
Muslim youth murder
religious violence
crime news
Jamner
police investigation
honor killing

More Telugu News