Arjun Tendulkar: ఒక ఇంటివాడు కాబోతున్న అర్జున్ టెండూల్కర్.. ఎవరీ సానియా చందోక్?

Arjun Tendulkar Gets Engaged To Saaniya Chandok
  • క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం
  • ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో ఎంగేజ్‌మెంట్
  • ముంబైలో అత్యంత సన్నిహితుల మధ్య గోప్యంగా జరిగిన కార్యక్రమం
  • ఇంకా అధికారికంగా ప్రకటించని టెండూల్కర్, చందోక్ కుటుంబాలు
  • సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న నిశ్చితార్థం వార్త
భార‌త క్రికెట్ దిగ్గ‌జం, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్కర్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ తన వ్యక్తిగత జీవితంలో కీలక ముందడుగు వేశాడు. తన ప్రేయసి సానియా చందోక్‌తో అర్జున్ నిశ్చితార్థం జరిగినట్లు జాతీయ మీడియా వర్గాలు బుధవారం వెల్లడించాయి. ముంబైలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ కార్యక్రమం అత్యంత గోప్యంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఎవరీ సానియా చందోక్?
సానియా చందోక్ ముంబైకి చెందిన ఒక ప్రముఖ వ్యాపార కుటుంబం నుంచి వచ్చారు. ఆమె ప్రముఖ పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు. హాస్పిటాలిటీ, ఫుడ్ ఇండస్ట్రీలో ఘాయ్ కుటుంబానికి మంచి పేరుంది. ముంబైలోని ప్రఖ్యాత ఇంటర్‌కాంటినెంటల్ హోటల్‌తో పాటు బ్రూక్లిన్ క్రీమరీ వంటి బ్రాండ్లు వీరివే. అయితే, ఈ నిశ్చితార్థంపై టెండూల్కర్ లేదా చందోక్ కుటుంబాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

అర్జున్ క్రికెట్ కెరీర్
25 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ తండ్రి బాటలోనే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, బ్యాటింగ్‌లోనూ స‌త్తా చాట‌గ‌ల‌డు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టుకు ఆడాడు. 2023లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టి, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై భువనేశ్వర్ కుమార్‌ను ఔట్ చేసి తన తొలి వికెట్‌ను అందుకున్నాడు. ఐపీఎల్ 2024 వేలంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అర్జున్‌ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.
Arjun Tendulkar
Sania Chandok
Sachin Tendulkar
Mumbai Indians
IPL
Indian Premier League
engagement
cricket
Goa cricket team
sports

More Telugu News