Nara Brahmani: లోకేశ్ నియోజకవర్గంలో సందడి చేసిన నారా బ్రాహ్మణి... వీడియో ఇదిగో!

Nara Brahmani Visits Lokesh Constituency Mangalagiri
  • మంత్రి లోకేశ్ నియోజకవర్గం మంగళగిరిలో నారా బ్రాహ్మణి పర్యటన
  • చేనేత చీరల సరికొత్త డిజైన్లను ఆసక్తిగా పరిశీలించిన బ్రాహ్మణి
  • కాజలోని కుట్టు శిక్షణా కేంద్రంలో మహిళలతో ముచ్చట్లు
  • చిన్నారుల పార్కును సందర్శించి సరదాగా ఉయ్యాల ఊగిన వైనం
  • లోకేశ్ ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సౌకర్యంపై భక్తుల నుంచి ఆరా
రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి నేడు మంగళగిరి నియోజకవర్గంలో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆమె స్వయంగా పరిశీలించి, స్థానికులతో మమేకమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించారు.

ముందుగా, మంగళగిరి చేనేత వస్త్రాలకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని, అక్కడి కార్మికులు రూపొందించిన సరికొత్త డిజైన్లను ఆమె ఆసక్తిగా తిలకించారు. చేనేత కళాకారుల నైపుణ్యాన్ని అభినందించారు. అనంతరం కాజలో ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ శిక్షణ పొందుతున్న మహిళలతో బ్రాహ్మణి ముచ్చటించి, వారి అనుభవాలను, శిక్షణ ద్వారా పొందుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు.

ఆ తర్వాత, నియోజకవర్గంలో చిన్నారుల కోసం నూతనంగా నిర్మించిన పార్కును బ్రాహ్మణి సందర్శించారు. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణంలో, పిల్లలతో కలిసి సరదాగా గడిపారు. ఈ సందర్భంగా పార్కులోని ఉయ్యాలపై ఆమె సరదాగా ఊగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అనంతరం, శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం మంత్రి నారా లోకేశ్ ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సేవలను బ్రాహ్మణి పరిశీలించారు. బస్సులో ప్రయాణిస్తున్న భక్తులతో నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. బస్సు సర్వీసు వల్ల తమకు ప్రయాణం సులభతరం అయిందని, ఎలాంటి ఇబ్బందులు లేవని భక్తులు ఆమెకు వివరించారు. ఈ పర్యటన ద్వారా నియోజకవర్గంలో అమలవుతున్న కార్యక్రమాల పురోగతిని ఆమె సమీక్షించారు.
Nara Brahmani
Mangalagiri
Nara Lokesh
AP Minister
Weavers
Women Empowerment
Free Bus Service
Panakala Lakshmi Narasimha Swamy Temple

More Telugu News